ప్రజావసర స్థలాలు లే..‘ఔట్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రజావసర స్థలాలు లే..‘ఔట్‌’

Aug 25 2026 12:21 AM | Updated on Aug 25 2026 12:21 AM

● అనుమతి సమయంలో కేటాయింపు ● ఆ తర్వాత యథేచ్ఛగా ప్లాట్లుగా విక్రయాలు ● రూ.కోట్ల విలువైన భూములు మాయం ● పాతమంచిర్యాలలోని ఓ వెంచర్‌ను దాదాపుగా 20 ఎకరాలతో ఏర్పాటు చేసి పార్కు, బడి, గుడి కోసం వదిలేసిన స్థలం మాయమైంది. ● పాతమంచిర్యాల సాయిబాబా గుడి పక్కన తిరుమలగిరి కాలనీలో పార్కు స్థలం లేకుండా పోగా, పాతమంచిర్యాల సబ్‌స్టేషన్‌ వెనకాల ఏర్పాటు చేసిన వెంచర్‌లో గుడి, బడి, పార్కు స్థలాలను అమ్ముకున్నారు. ● ఐబీ సమీపంలోని లేఔట్‌ అనుమతి కలిగిన వెంచర్‌ను కొన్నేళ్ల కిందటే ప్లాట్లుగా అమ్మేసి, ప్రజా వసరాల కోసం వదిలిన స్థలాలూ అమ్మేశారు.

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగర కార్పొరేషన్‌లో లేఔట్‌ అనుమతి పొందే సమయంలో గుడి, బడి, పార్కు, కమ్యూనిటీ భవనం వంటి ప్రజావసరాల కోసం నిబంధనల ప్రకారం స్థలాలు కేటాయించారు. అనుమతి పొందిన అనంతరం ఆ స్థలాలను ప్లాట్లుగా విక్రయించారు. వాటిని విక్రయించేందుకు నిబంధనలు వర్తించకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దు. కానీ రిజిస్ట్రేషన్‌ కావడం, మున్సిపల్‌ అనుమతితో భవనాలూ నిర్మించడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌గా మారిన తర్వాత భూముల ధరలు పెరిగాయి. గజానికి రూ.20వేలకు పైగా పలుకుతోంది. లేఔట్‌ స్థలాల్లో ప్రజావసరాల కోసం కేటాయించిన వాటిని కాస్త ధర తగ్గించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భవిష్యత్‌తో ఆయా లేఔట్‌లలో ఖాళీ స్థలాలు కనిపించని పరిస్థితి ఏర్పడనుంది.

హైటెక్‌సిటీలో..

నగరంలోని హైటెక్‌సిటీ వెంచర్‌ను 2006లో 68.95 ఎకరాలతో ఏర్పాటు చేసి లేఔట్‌ నిబంధనల మేరకు మూడు పార్కులు, ఒక కమ్యూనిటీ హాల్‌కు ఎకరం, ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించారు. పార్కులను మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. పాఠశాలకు కేటాయించిన ఎకరం స్థలం విక్రయానికి గత ఏడాది జరిగిన ప్రయత్నాలను కాలనీవాసులు, గత హైటెక్‌సిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అడుకున్నారు. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పాఠశాలకే వినియోగించాలని, గృహ నిర్మాణానికి అనుమతి లేదని, విరుద్ధంగా చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజులకే లేఔట్‌ నిర్వాహకులు ఆ బోర్డును తొలగించి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో అడ్డుకున్న అసోసియేషన్‌ కమిటీని రద్దు చేయించి అసలు కమిటీనే లేకుండా చేశారు. రూ.10 కోట్లకు పైగా విలువైన స్థలం అమ్మకానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement