పాతమంచిర్యాల: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కోరారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో రైతు కార్మిక సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్‌లు, పెట్టుబడిదారుల కోసం లేబర్ కోడ్‌లు తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగానే 10 గంటల పని విధానం జీవో తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు చేపట్టిన కార్యక్రమానికి రైతులు, కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.


