అమ్మపాలు అమృతం | - | Sakshi
Sakshi News home page

అమ్మపాలు అమృతం

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

● మొదలైన తల్లిపాల వారోత్సవాలు ● పుట్టిన గంట నుంచే పాలిస్తే సంపూర్ణ ఆరోగ్యం ● ఈ నెల 7 వరకు కార్యక్రమాలు

మంచిర్యాలటౌన్‌: పుట్టినప్పటి నుంచే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. బిడ్డను ఆరోగ్యంగా ఉంచేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి.. ప్రతీ బాలింత తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి.. అమ్మపాలు అమృతం..అని జిల్లా శిశు, మహిళా, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. బిడ్డకు అమ్మ పాలు అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. తల్లిపాలతో శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సి ందే. పుట్టిన బిడ్డకు తల్లిపాటు పడితే శిశువుతో పాటు, తల్లికీ లాభాలున్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాల ప్రాముఖ్యతను చాటేందుకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏటా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

పుట్టిననాటి నుంచి ఆర్నెల్ల వరకు

బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందుతా యి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్‌ ‘ఏ’ ఉంటుంది. బిడ్డ పుట్టిన గంట నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా అరుగుతాయి. శుభ్రంగా ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీనివల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం, పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.

పాలివ్వడం వల్ల తల్లికి లాభమే...

తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చనుబాలు ఇచ్చినందు వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భధారణకు పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు. బిడ్డకు పాలు పట్టించడం వల్ల రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్‌(ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.

తల్లిపాలతోనే బిడ్డకు ఆరోగ్యం

తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3,.6 అలాగే 9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టోజ్‌ వల్ల క్యాల్షియం నిల్లలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులను వివిధ రకాల అంటు వ్యాధుల బారినుంచి కాపాడుతాయి. బిడ్డ మనోవికాసానికి తోడ్పడుతాయి. బిడ్డ మృదువైన మల విసర్జనకు, మలబద్ధకం సమస్య నివారణకు తోడ్పడుతాయి. జీర్ణ మండలాన్ని వృద్ధి చేస్తాయి. తల్లిపాల ద్వారా బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. క్యాన్సర్‌, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల బారి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్‌ వంటి వ్యాధులు దరిచేరవు. బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలు

ప్రాజెక్టు అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులు గర్భిణులు బాలింతలు

మంచిర్యాల 244 2,406 1,110 839

లక్సెట్టిపేట 203 2,165 642 502

చెన్నూర్‌ 245 2,976 901 764

బెల్లంపల్లి 283 2,974 996 856

మొత్తం 975 10,521 3,649 2,961

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement