మంచిర్యాలక్రైం: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బందీగా ఉన్న బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్నారు. కార్మిక శాఖ, పోలీస్, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో బాల కార్మికులను గుర్తించి చెరలో ఉన్న బాల బాలికలను విడిపించి వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్ల కాలంలో 586 మంది బాలబాలికలకు బాసటగా నిలిచారు. ఇందులో 451 మంది బాలురు, 135 మంది బాలికలు ఉన్నారు. ఇందులో కొందరిని తల్లిదండ్రుల చెంతకు, మరికొంతమందిని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్పించి విద్యాబోధన చేస్తున్నారు.
బాల కార్మికులు ఎక్కడ ఉన్నారంటే..
చిన్నతనంలో తల్లిదండ్రుల ఆలనా పాలనకు నోచుకోని చిన్నారులతో పాటు తప్పిపోయిన పిల్ల లు, అనాఽథలు బాల కార్మికులుగా మారి..దుర్భరమైన జీవితాలను సాగిస్తున్నారు. అలాంటి వారికి ఆపరేషన్ స్మైల్/ముస్కాన్ ద్వారా ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ప్రధానంగా వస్త్ర దుకాణాలు, ఇటుక బట్టీలు, బేకరీలు, హోటళ్లు, భవన నిర్మాణ ప్రదేశాలు, సినిమా హాళ్లు, కిరాణా దుకాణాలు, ఇళ్లల్లో బాలలతో పనులు చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 41 కేసులు నమోదు కాగా 38 మందిని అరెస్ట్ చేశారు.
నిరంతర పర్యవేక్షణ అవసరం..
ఆపరేషన్ స్మైల్/ముస్కాన్ ద్వారా కాకుండా మిగతా అన్నిరోజుల్లో బాలకార్మిక వ్యవస్థపై నిఘా ఉంచాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకుండా బాలకార్మికులుగా గుర్తించిన వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలల్లో చేర్పించి వదిలేస్తున్నారు. ఆ తర్వాత వారు సక్రమంగా బడికి వెళ్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రత్యేక తనిఖీలతో సరిపెట్టకుండా నిరంతరం బాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మారని తీరు
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరిస్తున్నా.. ఆపరేషన్ స్మైల్/ముస్కాన్ కార్యక్రమం ద్వారా ఏటా రెట్టింపు సంఖ్యలో బాలకార్మికులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఒక్కటే కాకుండా కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ అఽధికారులు కూడా కృషి చేయల్సిన అవసరం ఉంది.


