ఆదిలాబాద్‌రూరల్: విద్యుత్ షాక్‌తో ఒకరి హత్యకు చేసిన కుట్రను ఆదిలాబాద్‌రూరల్ పోలీసులు భగ్నం చేశారు. పోలీసుస్టేషన్‌లో సీఐ రహీం పాషా వివరాలు వెల్లడించారు. మండలంలోని అంకోలికి చెందిన సుడగొణి సుధాకర్‌గౌడ్‌ను వ్యక్తిగత కక్షతో హత్య చేయాలని ప్రధాన నిందితుడు మడిగం స్వామి కుట్ర పన్నాడు. బడే రమేశ్, పుల్లేడు గంగన్నలకు డబ్బు ఆశ చూపి సహకారం తీసుకున్నాడు. పథకం ప్రకారం అర్ధరాత్రి సమయంలో బాధితుడి ఇంటి పైకప్పు ద్వారా విద్యుత్ తీగను బెడ్ వరకు ఏర్పాటు చేసి, ప్లగ్‌కు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అదే సమయంలో సుధాకర్‌గౌడ్ బయటకు రావడంతో నిందితులు పరారయ్యారు. సాంకేతిక విచారణ ఆధారంగా రమేశ్, గంగన్నను అరెస్ట్ చేసి వారి నుంచి కరెంట్‌వైరు, నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వా ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న స్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన ఎస్సై విష్ణువర్ధన్, అధికారులు, సిబ్బందిని అభినందించారు.


