మంచిర్యాలఅగ్రిలకల్చర్: జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వర్షపాతం లోటు నుంచి ఒక్కసారిగా అధిక శాతానికి చేరింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు జిల్లా కరువు కోరల్లో నుంచి బయటపడేసినట్లు అయ్యింది. చెరువులు, కుంటలు, ప్రధాన ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 8.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు శనివారం కాస్త తెరిపి ఇవ్వడంతో రైతులు పొలం పనులు, కలుపు, ఎరువులు, చీడపీడల మందుల పిచికారీలో బిజీగా మారారు. జలాశయాల కింద వరిసాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది 3.51 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా.. సరైన సమయంలో వర్షాల్లేక ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటివరకు 1.86లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. జూలై 29న 80.6మిల్లీమీటర్లు, 30న 102.8, 31న 79.7మిల్లీమీటర్లు మొత్తంగా 263.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై 28వరకు జిల్లా సగటున 26శాతం లోటు ఉండగా.. 26శాతం అధికానికి చేరుకుంది. దండేపల్లి మండలం మినహా అన్ని మండలాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదైంది. ఆరుతడి పంటలకు సరిపడా వర్షం కురువడంతో మొక్కజొన్న, పత్తి పంటలు జీవం పోసుకుని కళకళలాడుతున్నాయి. మరోవైపు వరినాట్లు జోరందుకున్నాయి. కొందరు రైతులు సేంద్రియ ఎరువులు కలియదున్నడం, పొలం గట్లు చెక్కడం, జంబుకొట్టి నాటు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వరినార్లు ముదిరినా తప్పనిసరి పరిస్థితుల్లో నాట్లు వేస్తున్నారు. మరికొందరు ఇప్పుడే నారుపోస్తున్నారు.


