మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం శుక్రవారం కాస్త తెరిపినిచ్చింది. దీంతో రైతులు పొలం బాట పట్టగా.. సాధారణ ప్రజానీకానికి ఊరట లభించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 473.2 మిల్లీమీటర్లు కాగా 596.8 మిల్లీమీటర్లు కురిసింది. 26శాతం అధికంగా నమోదైంది. దండేపల్లి మండలంలో 23శాతం లోటు నెలకొంది. కాసిపేట, బెల్లంపల్లి 60 నుంచి 83శాతం అత్యధికం, ఎనిమిది మండలాల్లో అధికం, ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలతో వేల ఎకరాల్లో మొలక దశలో ఉన్న పత్తి పంట నీట మునిగింది. పంట ఎదిగే దశలో ఉండడంతో వరద నీరు వెళ్తుందని తద్వార పంట నష్టం ఉండదని వ్యవసాయ అధికారులు తెలిపారు. కన్నెపెల్లి, కాసిపేట, బెల్లంపల్లి, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో 845 ఎకరాల్లో పత్తి పంటలోకి వరద నీరు చేరిందని ప్రాథమికంగా గుర్తించారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, బెల్లంపల్లి మండలాల్లో 53 విద్యుత్ స్తంభాలు, 2 ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ శాఖకు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇళ్లు, గోడలు కూలి రూ.45 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
ఉప్పొంగిన ప్రాణహిత
వేమనపల్లి/కోటపల్లి/చెన్నూర్‌రూరల్/భీమారం: వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వేమనపల్లి పుష్కరఘాట్‌తోపాటు రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ముల్కలపేట బొందచేను ఒర్రె, కళ్లెంపల్లి రహదారి వరకు వరద నీరు పోటెత్తి ప్రవహిస్తోంది. లోతట్టు గ్రామాలైన కళ్లంపల్లి, ముక్కిడిగూడం, గాజులపేట, సుంపుటం, వేమనపల్లి, కల్మలపేట, రాచర్ల, కేతన్‌పల్లి శివారు, కోటపల్లి మండలంలో వేల ఎకరాల పత్తి పంట మునిగింది. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో పడవల రాకపోకలు నిలిపివేశారు. చెన్నూర్ మండలం సుందరసాల గ్రామ సమీపంలో అన్నా రం బ్యారేజీ నీటితో కళకళలాడుతోంది. కత్తెరసాల గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.


