మంచిర్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. 41శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. పత్తి, వరి పంటల సాగు గడువు ముగిసింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నెల 15నాటికి భారీ వర్షాలు లేక జలాశయాల్లో నీరు చేరలేదు. దీంతో వరి సాగు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని, ఈ నెల 31వరకు విత్తుకోవాల్సిన ప్రత్యామ్నా య పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఖరీఫ్ సీజన్‌లో 3.57లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా.. ఎల్‌నినో ప్రభావంతో 3.20లక్షల ఎకరాలకే పరిమి తం అవుతుందని, ఈ నెలాఖరు వరకు వర్షాభావం కొనసాగితే 2.60లక్షల ఎకరాలకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1,58,765 ఎకరాల్లో పత్తి, వరి 170, కంది 667, మొక్కజొన్న 19, పెసలు 17, ఇతరత్రా 60 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం మరో 1,34,252 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు.
ప్రత్యామ్నాయం సాగయ్యేనా..
జిల్లాలోని దండేపల్లి, నెన్నెల, కోటపల్లి మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం 60నుంచి 74శాతం, మిగతా మండలాల్లో 20 నుంచి 55శాతం నెలకొంది. గత ఏడాది ఈ సమయానికి 2.17లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది 1.59లక్షల ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావం నేపథ్యంలో కంది, జొన్న, రాగి, అలసంద, ఉలువలు, ఆముదం, మొక్కజొన్న, కూరగాయలు, స్వల్పకాలిక వ్యవధి(70నుంచి 90రోజులు)లో దిగుబడి వచ్చే పప్పుదినుసులు సాగు చేయాలని సూచిస్తున్నారు. కానీ జిల్లాలో ఖరీఫ్‌లో అధికంగా పత్తి, వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. 22వేల ఎకరాల్లో వరి నారు పోసుకుని భారీ వర్షాలు కురిస్తే నాట్లు వేద్దామని ఎదురుచూస్తున్నారు. దీర్ఘకాలిక వ్యవధి(135నుంచి 150రోజులు)లో దిగుబడి వచ్చే సన్న రకం వరి ధాన్యం నారుపోశారు. వర్షాలేక నారు ముదిరిపోతుండడంతో బోరు, బావి మోటార్ల ద్వారా నీటితడులు అందిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఏళ్ల తరబడి పత్తి, వరి సాగు చేసిన రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపడం లేదు. అడవిపందులు, జంతువులు, కోతులు పంటలను నష్టపరుస్తాయని వాపోతున్నారు.


