● విధుల నుంచి వాచ్‌మెన్ తొలగింపు ● తల్లిదండ్రులకు విద్యార్థుల అప్పగింత
చెన్నూర్: చెన్నూర్ మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, ముగ్గురులెక్చరర్లపై బదిలీ వేటు పడింది. వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించగా.. విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. కళాశాలలో వసతులు లేవని మంగళవారం రాత్రి విద్యార్థులు 17మంది మంచిర్యాల ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లడం, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడం, ఆమె జిల్లా ఆర్సీవోకు సమాచారం ఇచ్చి విద్యార్థులను తిరిగి చెన్నూర్‌కు పంపించడం తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి సైదులు, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ అశోక్, ముగ్గురు లెక్చరర్లను బదిలీ చేయడంతోపాటు వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించినట్లు డీసీవో శిరీష, ఆర్సీవో శ్రీధర్ తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను అప్పగించామని, భైంసా, ఆదిలాబాద్ ప్రాంత విద్యార్థులను ఉపాధ్యాయులతో స్వగ్రామాలకు పంపించామని తెలిపారు. లక్సెట్టిపేట కళాశాల నుంచి 17మంది విద్యార్థులు వచ్చి వారం రోజులు కాలేదని, విద్యార్థులు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని, ఎవరు ప్రోత్సహించారనే విషయమై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్
సింగరేణికి వరం
జైపూర్: తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్ సింగరేణి సంస్థ భవిష్యత్‌కు గొప్ప వరమని ఆ సంస్థ డైరెక్టర్(ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావు తెలిపారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో బుధవారం ఆయన పర్యటించారు. బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవాల్లో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవితో కలిసి పాల్గొన్నారు. ఎస్టీపీపీ విస్తరణలో భాగంగా చేపట్టిన 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణ పనులు పరి శీలించారు. జీఎం మదన్‌మోహన్, ఏజీఎంలు సూ ర్యనారాయణరాజు, సుధాకర్‌రెడ్డి, శ్రీధర్, సీఎంవోఏఐ బ్రాంచ్ అధ్యక్షులు పంతులా పాల్గొన్నారు.


