మంచిర్యాలఅర్బన్: జిల్లాలో అడ్మిషన్ల నమోదు, అపార్ ఐడీ జనరేషన్ వేగంగా సాగుతోంది. పది హేను రోజుల వ్యవధిలోనే లక్ష్యానికి చేరువైంది. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఇన్‌చార్జి డీఈవో గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అధికారులపై పర్యవేక్షణ పెంచడం, రోజువారీ సమీక్షలు నిర్వహించడం, పాఠశాలల వారీగా ఆరా తీయడం వంటి చర్యల వల్ల నమోదు ప్రక్రియ వేగవంతమైంది. సమన్వయం, పర్యవేక్షణ తో తాజా నివేదికల ప్రకారం జిల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. జిల్లాకు కేటాయించిన విద్యార్థుల అడ్మిషన్ల లక్ష్యాన్ని ఇప్పటికే 89.5శాతం పూర్తి చేసి వంద శాతం మైలురాయిని అందుకుంటోంది.
ఎన్‌రోల్‌మెంట్ వేగంగా..
ఎన్‌రోల్‌మెంట్‌లో వేగం పుంజుకుంది. జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, టీఆర్‌ఈఐఎస్, ఎంఎస్, కేజీబీవీ, యూఆర్‌ఎస్ పాఠశాలల్లో మొత్తం 47,377 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలై 3 నాటికి 42,820 మంది విద్యార్థుల నమోదు ప్రక్రియ పూర్తయింది. జూలై 15 వరకు రెండు వారాల వ్యవధిలోనే 7,965 మంది కొత్త విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. సాధించాల్సిన లక్ష్యం 4,559 మంది(9.62శాతం) విద్యార్థుల నమోదు మిగిలిపోయింది. రాష్ట్రంలోనే అత్యుత్తమ లక్ష్య సాధనకు చేరువలో ఉన్న జిల్లాల జాబితాలో మంచిర్యాల ముందంజలో నిలిచింది.
డీఈవో మార్పుపై విస్తృత ప్రచారం..
ప్రస్తుత డీఈవో మార్పుపై జిల్లా విద్యాశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అదనపు కలెక్టర్ డీఈవోగా వ్యవహరిస్తుండడంతో నిబంధనలు కఠి నంగా మారాయి. ప్రైవేట్ పాఠశాలల నోటీస్ బోర్డులపై ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలనే ఆదేశాలు, అపార్ నమోదుపై కఠినంగా వ్యవహరించడం మింగుడుపడడం లేదు. గతంలో మాదిరిగా ఉపాధ్యాయ సంఘాల పప్పులు ఉడకకపోవడంతో తమకు అనుకూలంగా ఉండే డీఈవోను తెచ్చుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఓ ఉపాధ్యాయ సంఘం ఏకంగా తనకు అనుకూలమైన వ్యక్తిని డీఈవో కుర్చీలో కూర్చోబెట్టేందుకు హైదరాబాద్ వరకు వెంట బెట్టుకుని వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రైవేట్ పాఠశాలలు తామేమి తక్కువ కాదన్నట్లు జిల్లాకు చెందిన కీలకనేతకు గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా డీఈవోను మార్చాలనే పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలా ఎవరికి వారే జిల్లా విద్యాశాఖలో పైచేయి సాధించేలా కుర్చీలాట రసవత్తరంగా సాగుతోంది.
నమోదులో ప్రగతి..
గత పదిహేను రోజుల్లో గణనీయంగా పురోగతి సా ధించింది. జూలై ఒకటి నుంచి 15వరకు ఉన్న గ ణాంకాలను పరిశీలిస్తే.. జిల్లా వ్యాప్తంగా విద్యార్థు ల ఐడీ జనరేషన్ వేగవంతమైంది. జిల్లాలో 1059 పాఠశాలలు ఉండగా 1,24,083మంది విద్యార్థులు ఉన్నారు. జూలై ఒకటి నాటికి 77,020 ఉన్న ఐడీల సంఖ్య జూలై 15నాటికి 87,878కి చేరింది. రెండు వారాల్లోనే 10,858 ఐడీలను నమోదు చేయడం గ మనార్హం. మంచిర్యాల 20,738, మందమర్రి 8,873, బెల్లంపల్లి 7,896 నమోదుతో దూసుకెళ్లాయి.


