జిల్లాలో విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లు)
జూలై 2025 2026
10న 2.401 2.707
11న 2.614 2.993
12న 2.656 2.901
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉత్తర కార్తెలో ఉరిమి ఉరిమి కొట్టె భారీ వర్షాలు ఊసే లేకుండా పోయాయి. ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు కానరాకుండా మాయం అవుతున్నాయి. వానకాలమా.. ఎండకాలమా అనే తీరులో ఎండలు కొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర రోజులు గడుస్తున్నా భారీ వర్షాల్లేవు. ఎల్‌నినో వెంటాడుతోందని రైతుల గుండెల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే విత్తుకున్న పంటలను కాపాడుకోవడానికి, మరోవైపు వరినాట్లు వేసుకోవడానికి నారు పోసుకున్న రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. కార్తెలు కరిగిపోతున్నా మబ్బులు మాత్రం కరగడం లేదు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు నీరు లేక బోసిపోతున్నాయి. ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది.
36శాతం లోటు వర్షపాతం
జూలై రెండో వారం గడిచినా భారీ వర్షాలు కురవలేదు. జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటివరకు 291.4మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. 186.7మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 36శాతం లోటు ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటే జిల్లా కరువుకోరల్లో చిక్కుకోనుంది. జిల్లాలోని 17మండలాల్లో 12శాతం నుంచి 58శాతం లోటు వర్షపాతం ఉండగా.. దండేపల్లి మండలంలో అత్యధికంగా 68శాతం లోటు నెలకొంది. వర్షాల్లేక చెరువులు, కుంటల్లో నీరు లేదు. జిల్లాలో ప్రధాన ప్రా జెక్టులు ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి డెడ్‌స్టోరేజీలో ఉన్నాయి. ఆయకట్టులో వరి సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలతో పత్తి, ఇతర కూరగాయల పంటలు సాగు చేశారు. నారు పోసినా పొలా ల్లో నీరు లేక నాట్లు వేయడం లేదు. మరోవైపు భూగర్భజలాలు పెరగలేదు. భారీ వర్షాలు కురి స్తే జిల్లాలో 90శాతం పంటలు విత్తుకోవడం పూర్తయ్యేది. కానీ ఇప్పటివరకు 50శాతం కూడా విత్తనాలు వేసుకోలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్ష పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
38శాతమే..
ఈ ఖరీఫ్‌లో 3.57లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1,54,069 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ఎక్కువగా పత్తి 1,53,264 ఎకరాల్లో విత్తుకున్నారు. వర్షాల్లేకపోవడంతో పత్తిమొక్కలు వడలిపోతున్నాయి. ఇప్పటికే పత్తి విత్తనాలు వేసుకునే గడువు ముగిసింది. వరి నారు కాపాడుకునేందుకు బోరుమోటార్ల ద్వారా నీటితడులు అందిస్తున్నారు. స్వల్పకాలిక వరి విత్తనాల నాట్లు వేసుకునే గడువు ఆగస్టు మొదటి వారం వరకు ఉంది. వర్షాలు సకాలంలో కురువకపోతే సాగునీటితోపాటు తాగునీటికీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరుతడి పంటలు ఆగస్టు చివరి వరకు సాగు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నెలాఖరులోపు భారీ వర్షాలు కురిస్తే రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది.
జిల్లాలో ఇప్పటి వరకు వర్షపాతం
మండలం సాధారణం కురిసింది లోటు శాతం
(మి.మీ)
జన్నారం 311.5 181.4 42
దండేపల్లి 269.8 85.4 68
లక్సెట్టిపేట 270.2 227.6 16
హాజీపూర్ 297.5 222.6 25
కాసిపేట 277.9 241.2 13
తాండూర్ 283.6 237.9 16
భీమిని 307.7 164 47
కన్నెపల్లి 307.9 165.7 46
వేమనపల్లి 289.1 145.5 50
నెన్నెల 366.8 133.3 58
బెల్లంపల్లి 285.4 248.5 13
మందమర్రి 276.8 244.5 12
మంచిర్యాల 290.8 238.3 18
నస్పూర్ 291.4 168.6 42
జైపూర్ 294.1 177.4 40
భీమారం 280.3 169.9 39
చెన్నూర్ 300.3 184.5 39
కోటపల్లి 293.4 1238 58
జిల్లా మొత్తం 291.4 186.7 36 శాతం లోటు


