దండేపల్లి: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగమైందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. మండలంలోని లింగాపూర్‌కు చెందిన బానవత్ నర్సింహ ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. ఆయన కుటుంబ సభ్యులను మంత్రి సోమవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్ ఖాతాలోకి రూ.1400 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకేసారి పార్టీ ఖాతాలోకి చేరాయంటే అవినీతి కారణం కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ రంగంలో అక్రమాలు జరిగాయని, వేలం ప్రక్రియలో తమకు నచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చి, కొత్త గనుల కేటాయింపులో వివక్ష చూపించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దమ్మసునీల్, సాగర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన నాయకులు..
స్థానిక ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్న దండేపల్లి మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మండలానికి విచ్చేసిన మంత్రి వివేక్‌ను కలిశారు. ఓ ముఖ్య నాయకుడి ఇంటికి మంత్రి నేరుగా వెళ్లడం, ఆ నాయకుడి ఇంటి వద్దనే మంత్రిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరితోపాటు కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు కూడా మంత్రిని కలిశారు.
అర్హుల ఓట్లు తప్పిపోవద్దు
చెన్నూర్: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూసే బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెన్నూర్, కోటపల్లి మండలాల బీఎల్‌ఏలతో సర్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు బాపగౌడ్, కొండు వెంకటేశ్, కట్రల మల్లయ్య, నర్సింగ్ పాల్గొన్నారు.


