సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెల్ల కాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన భూముల క్రమబద్ధీకరణలో అనేకం అనర్హమైన అర్జీలేనని క్షేత్రస్థాయిలో వెల్లడవుతోంది. మొత్తం 26వేలకు పైగా అర్జీలు రాగా ఇప్పటివరకు ఆరు వేలకు పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. వీటిలో 139మాత్రమే అర్హత పొందాయి. మిగతావి తిర్కరణకు గురయ్యాయి. ఇంకా పరిశీలన కొనసాగుతోంది. గత ఆరేళ్లుగా సాదాబైనామాకు దరఖాస్తు చేసుకున్న రైతులు ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా సాగులో ఉండి హక్కులు లేని వారికి క్రమబద్ధీకరించాలనే ఆశయంతో 2020లో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. అదే ఏడాది ఆర్వోఆర్ రద్దు కావడంతో దరఖాస్తుల పరిశీలన రద్దయిపోయింది. గతేడు ఆగస్టులో సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరణకు ప్రధానంగా 2014 జూన్ రెండో తేదీకి ముందు తెల్లకాగితాలపై జరిగిన అర్జీలు మాత్రమే ప్రధాన అర్హతగా నిర్ణయించారు. సాగుదారులు కచ్చితంగా కొనుగోలు, అమ్మకందారుల మధ్య ఒప్పంద పత్రం ఉండాలని షరతు విధించారు. తర్వాత అఫిడవిట్ నిబంధన సైతం తర్వాత సడలించడంతో మళ్లీ దరఖాస్తుల ప్రక్రియ ముందుకు కదులుతోంది. మొత్తంగా ఐదు ఎకరాల వరకు క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది.
అత్యధికంగా సర్కారు భూములు
జిల్లాలో కొందరు రైతులు ఏళ్లుగా సాగులో లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్లలో 18మండలాల్లో మొత్తం 26వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిధిలో 30వేలకు పైగా సర్వేనంబర్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు అర్హత లేనట్లుగానే తేలింది. కానీ అర్హత కంటే అనర్హత అర్జీలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. అయితే సాదాబైనామా కింద చాలా దరఖాస్తులు అనర్హులే ఉన్నట్లు క్షేత్రస్థాయి విచారణలో తేలుతోంది. ఆర్‌ఐలు పంచనామా చేస్తున్న క్రమంలో సర్కారు భూములు, ఒక సర్వేనంబరుకు బదులు మరో నంబరు వేయడం, ఐదు ఎకరాలకు పైబడి, కొన్ని చోట్ల మోకాపై లేకున్నా అర్జీలు వచ్చాయి. వీటన్నింటిని తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్డీవోకు రిపోర్టు చేస్తున్నారు. తుదిగా క్రమబద్ధీకరణకు ఆర్డీవోలకే అధికారాలు కల్పించారు. భూ భారతి సదస్సుల్లోనూ ఇలాంటి దరఖాస్తులే అధికంగా రావడంతో వాటిని పరిశీలించకుండానే అధికారులు తిరస్కరించారు. మళ్లీ సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలంటూ ఆదేశాలు రావడంతో రోజువారీగా దరఖాస్తులపై అధికారులు అన్ని వివరాలు తీసుకుంటున్నారు. నోటీసులు ఇచ్చి తగిన ఆధారాలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే భూములు పరిశీలన, రికార్డులు పోల్చిన తర్వాత చాలా చోట్ల సర్కారు, అటవీ భూములు కూడా ఉంటున్నాయి. అసైన్డ్ భూములు సైతం సాగులో ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అలాంటి దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్లు అఽధికారులు చెబుతున్నారు.
అన్నీ పరిశీలించాకే ఆమోదం
చాలా దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములను కొనుగోలు చేసినట్లు చూపించారు. సర్కారు భూములు అమ్మడం, కొనడం నేరం. దీంతో వాటన్నింటినీ తిరస్కరిస్తున్నాం. ఇవేకాకుండా కొందరు మోకలో లేకున్నా అర్జీ పెట్టారు. ఇలా ప్రతీ అర్జీని పూర్తిగా పరిశీలించాకే నిబంధనల మేరకు ఆమోదిస్తున్నాం.
– ఎస్.శ్రీనివాసరావు, ఆర్డీవో మంచిర్యాల
వివరాలు
మొత్తం దరఖాస్తులు 26,884
సర్వే నంబర్లు 30,401
నోటీసులు ఇచ్చింది 26,881
తహసీల్దార్ల వద్ద పెండింగ్ 11,258
ఆర్డీవోల వద్ద పెండింగ్ 9,061
పూర్తి చేసిన అర్జీలు 6,564
వీటిలో ఆమోదించినవి 139
తిరస్కరణ 6,940


