ఇదేమి ‘శిక్ష’ణ..! | - | Sakshi
Sakshi News home page

ఇదేమి ‘శిక్ష’ణ..!

Jul 14 2026 12:06 AM | Updated on Jul 14 2026 12:06 AM

వేదిక లేక అవస్థలు.. టీచర్లు, విద్యార్థులకు కష్టాలు

తరగతి గదిలోనే శిక్షణ.. చదువులకు ఆటంకం

పిల్లల బెంచీలపై ఉపాధ్యాయుల అవస్థలు

మంచిర్యాలఅర్బన్‌: ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి నిర్వహిస్తున్న శిక్షణ ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. శిక్షణకు ప్రత్యేక వేదిక లేకపోవడంతో పాఠశాలల తరగతి గదుల్లోనే ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్‌(ఐఎఫ్‌పీ) స్మార్ట్‌బోర్డు, డిజిటల్‌ స్క్రీన్‌ ద్వారా శిక్షణ నిర్వహించాల్సి వస్తోంది. పాత జిల్లా కేంద్రాల్లో డైట్‌ కళాశాలలు, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అనువైన గదులు, ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ సౌకర్యాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత అలాంటి వసతి లేకపోవడంతో పాఠశాలల్లో నిర్వహించాల్సి వస్తోంది. శిక్షణ కోసం తరగతి గదులు ఖాళీ చేయాల్సి రావడంతో విద్యార్థులను ఇతర గదుల్లో సర్దుబాటు చేయడం కష్టతరంగా మారుతోంది. ఉపాధ్యాయులు విద్యార్థుల బెంచీలపై రోజంతా కూర్చోవాల్సి రావడంతో అసౌకర్యంగా మారింది. రోజుల తరబడి సాగే శిక్షణ కార్యక్రమాల వల్ల బోధనకు ఆటంకంగా మారి విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతోంది.

ప్రత్యేక వేదిక లేక ఇబ్బందులు

జిల్లాలో జూలై 8నుంచి 31వరకు ఉపాధ్యాయులకు ఏఐ, డిజిటల్‌ అనుసంధానంతో సబ్జెక్టు వారీ శిక్షణ ఇస్తున్నారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, ప్రభుత్వ, లోకల్‌బాడీ, మోడల్‌స్కూల్‌లోని 2,848మంది బోధకులకు విషయ బోధన సాగుతోంది. వీరిలో 1,773 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 1,075మంది ఎస్జీటీలు ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామం గంట మినహాయిస్తే ఉదయం 9.30గంటల నుంచి 5గంటల వరకు బోధన నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. మొదట మూడు రోజులు మంచిర్యాల జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల, గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. సోమవారం నుంచి తీగలపహాడ్‌, పాతమంచిర్యాలలో మొదలైంది. ఒక్కో చోట 90 నుంచి 100 మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. శిక్షణకు ప్రత్యేక వేదిక లేక సమస్యగా మారింది. స్కూళ్లు శిక్షణ కేంద్రాలుగా ఉపయోగించడంతో ఇబ్బందులు పడుతున్నారు.

వరుసగా..

విద్య నాణ్యత పెంపు లక్ష్యంగా ఏడాదికాలం వరుసగా శిక్షణ ఉంటుంది. ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌), డిజిటల్‌ లెర్నింగ్‌, నిపుణ్‌ భారత్‌, డిజిటల్‌ టీచింగ్‌ పద్ధతులు, సమగ్ర శిక్ష కార్యక్రమాల కింద ఇలా 16రకాల శిక్షణ ఉంటుంది. ప్రతీ నెల తరచుగా జరిగే పాఠశాలల్లో పాఠాలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల రెండేసి తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధించాల్సి వస్తోంది.

విద్యాశాఖ సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించకుండా పాఠశాలల పని దినాల్లో పరివర్తనాత్మక తరగతుల బోధన, నాణ్యమైన విద్య, సమగ్ర శిక్షణ పేరిట ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు శిక్షణ చర్చనీయాంశంగా మారింది. పండుగలు, ఇతరత్రా సెలవుల్లో నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే బడి నుంచి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు మూడు రోజులు శిక్షణకు వెళ్తుండడంతో బోధన ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి. ఇద్దరున్న ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే బోధించాల్సి ఉంది. అడ్మిషన్లు పెరుగుతున్న వేళ టీచర్లు లేకపోవడంతో చదువులపై ప్రభావం పడుతోంది. ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలని, సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement