నేరడిగొండ: మండలంలోని వడూర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కడారి రాములు తనకు ఉన్న ఎకరంన్నర భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. బుధవారం చేనులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి సుమారు 15 క్వింటాళ్ల మొక్కజొన్న పూర్తిగా కాలిపోయింది. పంట విలువ సుమారు రూ.40వేల వరకు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
‘మా ఊర్లో ఐస్‌క్రీమ్‌లు అమ్మవద్దు’
ఇంద్రవెల్లి: మండలంలోని వాల్గొండలో ఐస్‌క్రీమ్‌ల అమ్మకం నిషేధిస్తూ గ్రామస్తులు బుధవారం తీర్మానం చేశారు. గ్రామస్తులంతా ఏకమై గ్రామ ముఖద్వారం వద్ద ఐస్‌క్రీమ్ అమ్మకాలపై నిషేధం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోకి ఐస్‌క్రీమ్‌ల వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నామన్నారు. ఎవరైనా ఐస్‌క్రీమ్‌తో తమ గ్రామానికి వస్తే రూ.500 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కినక లచ్చు, జుగాదిరావ్, మెస్రం సోమేశ్వర్, దుర్వ గణపతి, మెస్రం రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక
లక్సెట్టిపేట: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసిన వారి పేర్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశాల మేరకు చైర్‌పర్సన్ దొంత అంజలి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆరీఫ్ వెల్లడించారు. స్థానిక ఐబీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. బీసీ నుంచి తొగిలి నరసింహచారి, చింత సువర్ణ, ముస్లీ మైనార్టీల నుంచి సయ్యద్ తైసిన్ హాజీ, క్రిస్టియన్ మైనార్టీగా నక్క జాకబ్‌లను ఎంపిక చేసినట్లు తెలిపారు. 15 మంది దరఖాస్తు చేసుకోగా నలుగురి పేర్లను ప్రకటించామని, అవకాశం దక్కని అభ్యర్థులు నిరుత్సాహ పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల నాగభూషణం, చింత అశోక్, వెంకటస్వామి గౌడ్, వైస్ చైర్‌పర్సన్ రాజేశ్వరి, నాయకులు పాల్గొన్నారు.


