మందుబాబులపై పోలీసుల కొరడా
ఆదిలాబాద్‌టౌన్: మందుబాబులపై పోలీసులు కొరడా ఝులిపించారు. నూతన వేడుకల సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 30 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు తనిఖీలు కొనసాగించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జిల్లా వ్యాప్తంగా 211 కేసులు నమోదు కాగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు డివిజన్ పరిధిలో ఒక్కరోజే 175 కేసులు నమోదు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ అర్ధరాత్రి సమయంలోనూ ఈ తనిఖీలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, కర్రె స్వామి, ప్రణయ్ కుమార్, ఫణీదర్, శ్రావణ్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.


