● మున్సిపాలిటీల్లో ఎన్నికలకు అధికారుల కసరత్తు ● వార్డుల
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రకటన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఆయా డివిజన్లు, వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు, తుది ఓటరు జాబితా ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గురువారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాల్టీల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. మందమర్రి మున్సిపాల్టీలో ఏజెన్సీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండగా.. ఈసారి సైతం ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. మిగతా పట్టణాల్లో ఈ నెల 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, 6న జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సమావేశం, 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా వెల్లడి ఉంటాయి. పట్టణాల్లో చివరిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. గత ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం అంతా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్‌కు నివేదించి త్వరలోనే ఎన్నికలకు వెళ్లనుంది.
ఆశావహుల ప్రయత్నాలు
పట్టణాల్లో గత ఏడాదిగా ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా, మాజీ కౌన్సిలర్లు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమ వార్డుల్లో ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన చెన్నూర్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, లక్షెట్టిపేట పట్టణాల్లోనూ రాజకీయ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వార్డు, డివిజన్లలో రిజర్వేషన్లు అనుకూలిస్తే మహిళా, జనరల్, రిజర్వు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై జరుగనున్న తరుణంలో కార్పొరేటర్, కౌన్సిలర్‌గా పోటీ కోసం అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల జిల్లా నాయకత్వం పట్టణాల్లో అధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.
● మున్సిపాలిటీల్లో ఎన్నికలకు అధికారుల కసరత్తు ● వార్డుల


