బోగస్ పింఛన్ల ఏరివేత
పాతమంచిర్యాల: చేయూత పథకం ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లలో అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికే అందించేలా ముఖ గుర్తింపు యాప్(ఫేషియల్ రికగ్నిషన్ యాప్) తీసుకొచ్చింది. ఈ విధానంలోనే గత నాలుగు నెలలుగా పింఛన్లు అందజేస్తోంది. పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం ప్రతీ జిల్లాలో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌లో కొత్త పింఛన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉండగా అంతకుముందే పింఛన్ల వడపోత కార్యక్రమాన్ని ప్రత్యేక విజిలెన్స్ కమిషన్‌తో సోషల్ ఆడిట్ చేపట్టనున్నారని సమాచారం. బోగస్ పింఛన్లలో అక్రమాలను అరికట్టడానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని జిల్లాల్లో చేపట్టిన సోషల్ ఆడిట్‌లో 50ఏళ్లు నిండనివారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఎలాంటి శారీరక వైకల్యం లేకున్నా బోగస్ సదరం ధ్రువీకరణ పత్రాలు పొంది పింఛన్లు పొందుతున్న ఘటనలు బయటపడ్డాయి. దీంతో గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి నిజమైన లబ్ధిదారులుగా అర్హులను గుర్తించి పింఛన్లు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపా రు. చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్ పేషెంట్లు, బీడీ టేకేదారులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు 93,880 మందికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రతీ నెల రూ.22,48,22,016 పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం 2022లో ఆసరా వృద్ధాప్య పింఛన్‌దారుల వయస్సును 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించింది. పింఛన్ మొత్తాన్ని పెంచింది. దీంతో చాలామంది ఆధార్‌కార్డుల్లో తమ వయస్సును తక్కువ చేయించి పింఛన్లు పొందారనే సమాచారం అధికారుల దృష్టికి వచ్చింది. పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్న వాటిలో మృతులకు అందుతున్నాయని, నిలిపి వేయలేదని పేర్కొంటున్నారు. అక్రమాల నిరోధానికి పింఛన్‌దారుల గుర్తింపు కోసం పోస్టుమాస్టర్లకు మొబైల్‌ఫోన్లు, ఫింగర్‌ప్రింట్ డివైజ్‌లు అందజేశారు. మొబైల్‌ఫోన్ ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ పరికరాల్లో లబ్ధిదారుల గుర్తింపు జరగపోతే పోస్టుమాస్టర్, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం ద్వారా ప్రస్తుతం పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.
జిల్లాలో లబ్ధిదారులు
వృద్ధులు 36972
దివ్యాంగులు 11540
వితంతువులు 38954
చేనేత కార్మికులు 278
గీతకార్మికులు 873
ఒంటరి మహిళలు 2472
బీడి వర్కర్లు 2336
ఫైలేరియా రోగులు 268
డయాలసిస్ 172
బీడీ టేకేదార్‌లు 15


