రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమం
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్‌లో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 31వరకు నెల రోజులపాటు నిర్వహిస్తామని, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై రూపొందించామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు అవగాహన కల్పించడంతోపాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా, వేగం నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.


