సమ్మక్క జాతరకు ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని గోదావరి నదీ తీరాన ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే సమ్మక్క, సారక్క జాతరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి ఒడ్డున జరిగే జాతర కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. మరుగుదొడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుతోపాటు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలని తెలిపారు.


