ఓటరు జాబితా సిద్ధం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ వలియత్ అలీతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించి ఉండకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా జనవరి ఒకటిన అందించాలని తెలిపారు.
పంట మార్పిడితోనే అధిక దిగుబడి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అధికారి ఈ.శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఉద్యానవన శాఖ అధికారి అనితతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాణిజ్య పంటలు, కూరగాయల సాగు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్, మండల వ్యసాయ అధికారులు, విస్తరణ, ఉధ్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.


