చలి నుంచి రక్షణ పొందాలి | - | Sakshi
Sakshi News home page

చలి నుంచి రక్షణ పొందాలి

Dec 31 2025 7:34 AM | Updated on Dec 31 2025 7:34 AM

చలి న

చలి నుంచి రక్షణ పొందాలి

దగ్గు, జలుబు ఎక్కువ రోజులు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌ సాక్షి ఫోన్‌ ఇన్‌కు ప్రజల నుంచి స్పందన

మంచిర్యాలటౌన్‌: ‘జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న చలి నుంచి ప్రజలు రక్షణ పొందాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, నిమోనియా వంటివి వస్తున్నాయి. రెండ్రోజుల కంటే ఎక్కువ ఉంటే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స, మందులు తీసుకోవాలి. చలి తీవ్రత వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌ సూచించారు. చలి తీవ్రత నేపథ్యంలో వ్యాధులు, జాగ్రత్తలపై సాక్షి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌లో ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.

ప్రశ్న: పిల్లలకు దగ్గు, జలుబు రావడం, మందులు వాడగానే తగ్గిపోవడం జరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. – బొమ్మన మహేశ్‌, దండేపల్లి, మహేశ్‌ జానె, జన్నారం

సూపరింటెండెంట్‌: చలి పెరిగినప్పుడు పిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఇంట్లోనూ చలితో ఇబ్బంది పడకుండా రూం హీటర్‌, ఇతర ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి. చలి నుంచి రక్షణకు స్వెట్టర్లు వేసి ఉంచాలి. వేడి ఆహారం మాత్రమే పెట్టాలి. చలిగాలి ముక్కు, చెవుల ద్వారా శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: పాపకు మూడేళ్లు. మందులు వాడుతున్నా దగ్గు, జలుబు తగ్గడం లేదు

– మనోజ్‌కుమార్‌, రాంనగర్‌, మంచిర్యాల

సూపరింటెండెంట్‌: వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడికి చూపించి అవసరమైన మందులు వాడాలి. చల్లని నీరు, ఆహార పదార్థాలు తినకుండా చూడాలి. గోరు వెచ్చని నీటిని తీసుకోవడం, రూంహీటర్‌తో గది ఉష్ణోగ్రతలను తగ్గకుండా చూసుకోవాలి. మూడు లీటర్ల నీటిని ప్రతీరోజు తాగేలా చూడడంతోపాటు పిల్లలు వయస్సుకు తగిన బరువు పెరిగేలా చూడడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

ప్రశ్న: రాత్రి, ఉదయం సమయాల్లోనే దగ్గు ఎక్కువగా వస్తుంది

– సుదర్శన్‌గౌడ్‌, గ్రామం: పారాపూర్‌, మం: కన్నెపల్లి, సాకేత్‌, గ్రామం: కొత్తపల్లి, మం: చెన్నూర్‌, కార్తీక్‌, తిలక్‌నగర్‌, మంచిర్యాల

సూపరింటెండెంట్‌: ఎక్కువ రోజులు దగ్గు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాలి. దాహం వేయక పోయినా ప్రతీరోజు మూడు లీటర్ల నీటిని తాగాలి. దగ్గు, జలుబు వంటివి వచ్చినప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవాలి.

ప్రశ్న: చలితో గొంతులో నొప్పిగా ఉండడం, కాళ్ల పగుళ్లు వస్తున్నాయి.

– తిరుపతి బొజ్జ, శ్రీరాంపూర్‌

సూపరింటెండెంట్‌: గొంతులో నొప్పిగా అనిపిస్తే గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మాలి. చలితో నీరు కూడా చల్లగా అవుతుండడం వల్ల గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగాలి. చలికి రక్తం చిక్కగా అయ్యే అవకాశం ఉండడం వల్ల పాదాలకు సక్రమంగా రక్తప్రసరణ కాదు. దీనివల్లనే కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి. రాత్రి సమయంలో కాళ్లకు నూనె రాసుకుని, సాక్సులు వేసుకుంటే సమస్య తగ్గిపోతుంది.

ప్రశ్న: జ్వరం, నంజుతో కూడిన దగ్గు వస్తుంది.

– రమేశ్‌, చింతగూడ, జన్నారం

సూపరింటెండెంట్‌: దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని మందులు వాడాలి. అలర్జీకి సంబంధించిన మందులు వాడవద్దు. దగ్గు, జలుబు వంటివి వచ్చినప్పుడు అలర్జీ మందులు వాడితే తెమడ చిక్కగా మారి ఇబ్బంది పెడుతుంది. తగినంత నీటిని తాగుతూ మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది.

ప్రశ్న: ఏ కాలంలోనైనా మా పిల్లలు తరుచూ ఏదో ఒక ఆరోగ్య సమస్యకు గురవుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

– సతీశ్‌ కుమార్‌, కోటపల్లి

సూపరింటెండెంట్‌: పిల్లల్లో ఆరోగ్య సమస్యలకు సరైన పౌషకాహారం తీసుకోకపోవడమే. వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. లేకుంటే త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. బరువు తక్కువగా ఉంటే ప్రతీరోజు రెండు కోడిగుడ్లు బరువు పెరిగే వరకు ఇవ్వాలి. పిల్లలు తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూడడంతోపాటు ప్రతీరోజు మూడు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగేలా చూడాలి.

ప్రశ్న: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి సమయంలో మరింత ఎక్కువ అవుతుంది.

– కే.శ్రీనివాస్‌, లక్సెట్టిపేట

సూపరింటెండెంట్‌: చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటివి వస్తాయి. అస్తమా సమస్య ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇన్‌హేలర్‌లు వైద్యులు సూచించినట్లుగానే వాడాలి. మందులు సైతం ఎవరికి వారు మెడికల్‌ షాపునకు వెళ్లి తీసుకోకుండా, వైద్యుడు సూచించిన విధంగానే వాడాల్సి ఉంటుంది.

చలి నుంచి రక్షణ పొందాలి1
1/1

చలి నుంచి రక్షణ పొందాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement