న్యూ ఇయర్ వేడుకలపై నిఘా
మంచిర్యాలక్రైం: ‘న్యూ ఇయర్ వేడుకలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రాత్రి 10గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతాం. బుధవారం అర్ధరాత్రి 12గంటల తర్వాత రోడ్లపై కేక్ కటింగ్‌లు, డీజే సౌండ్స్, నృత్యాలు చేయడం నిషేధం. రోడ్లపై కి గుంపులుగా వచ్చి సంబరాలు చేసుకునే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు..’ అని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు, పోలీసుల భద్రత చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలోని ఏ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తినా 100 డయల్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వేడుకల్లో అపశ్రుతులు దొర్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డీసీపీ: ట్రాఫిక్ పోలీసు, షీటీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్, అదనపు ప్రత్యేక బలగాలతో పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. అక్రమ సిట్టింగ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గుంపులుగా తిరుగుతూ మహిళలను వేధించడం వంటి ఘటనలు అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ, సీసీ కెమెరాలతో నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తాం.
డ్రగ్స్, గంజాయి వినియోగం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మద్యంమత్తులో గొడవలు, అల్లర్లను ఎలా నివారిస్తారు
డీసీపీ: తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను అంధకారం చేసుకోవద్దు. అనుమానిత ప్రాంతాలపై సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టాం. గంజాయి పాత నేరస్తులు, సస్పెక్ట్ నిందితులపై పూర్తి స్థాయి నిఘా ఉంచాం. రౌడీషీటర్స్, పాత నేరస్తులకు హెచ్చరికలు జారీ చేశాం. జిల్లా వ్యాప్తంగా 1200 మంది సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు.


