వడ్లు లేవు.. మళ్లీ ధాన్యం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వడ్లు లేకున్నా మరోసారి అనుమతి ఇచ్చి పౌరసరఫరాల శాఖ అధికారులు తమ ఉదారతను చాటుకున్నారు. సీఎంఆర్(కస్టం మిల్డ్ రైస్) బకాయిలు ఉన్న మిల్లులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఆంక్షలు విధిస్తోంది. ఇచ్చిన ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు 10శాతం, ఇంకా అదనంగా బకాయి, జరిమానా, వడ్డీతో కలిపి ఆ మేరకు గ్యారంటీలు ఇవ్వాలి. ఇక టెండర్ ధాన్యం బకాయిలకు పూర్తిగా చెల్లిస్తేనే అనుమతులు ఇస్తున్నారు. లేకపోతే బ్లాక్ లిస్టులోనే ఉంటున్నాయి. కానీ జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం శివారు ఓ మాడ్రన్ రైస్ మిల్లులో గత రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం తక్కువగా ఉంది. అయినప్పటికీ మంగళవారం ఖరీఫ్‌లో ధాన్యం తీసుకునేందుకు అనుమతి వచ్చింది. ఇదే తీరుగా మరో ఏడు మిల్లులు సైతం బకాయిలు ఉన్నాయి. వాళ్లు సైతం ప్రభుత్వ అనుమతి పాటిస్తామని చెబుతున్నా అధికారులు కనికరించలేదు. కానీ ధాన్యం సేకరణ తుది దశలో ఆగమేఘాల మీద ఇందారంలోని ఓ మిల్లుకు ట్యాగింగ్ రావడం గమనార్హం. ఆ మిల్లు సీఎంఆర్ కింద 19ఏసీకే(ఒక ఏసీకే 290క్వింటాళ్లు)ల బియ్యం పెట్టాలి. ధాన్యం బస్తాల్లో లెక్కగడితే 20వేలకు పైగా బస్తాలు మిల్లులో ఉండాలి. అయితే ఆ ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్, బియ్యం నేరుగా కొనుగోలు చేసి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. అయితే ఆ మిల్లులో రెండు వేలలోపు కూడా బస్తాలు లేకపోవడం గమనార్హం. బకాయి మేరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చానని చెబుతూ అనుమతి తెచ్చుకున్నారు. మరోవైపు ప్యాడీ షిఫ్టింగ్(ధాన్యం బదిలీ) పేరుతో ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు అధికారికంగానే బదిలీ చేసుకుని, ఇదే మిల్లు లబ్ధిపొందిన ఘటనలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.
ట్యాగింగ్ ఎలా ఇచ్చారో..
వానాకాలంలో ధాన్యం దిగుబడి తగ్గింది. జిల్లా మిల్లులు పాత బకాయిల కారణంగా ఈ సీజన్‌లో 27మిల్లుల వరకు ట్యాగింగ్ ఇచ్చారు. మిగతావన్నీ పొరుగు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లికి పంపారు. ఆ జిల్లాలకు పంపిన వ్యవహారంలోనూ రూ.లక్షలు చేతులు మారినట్లు మిల్లర్లే చర్చించుకుంటున్నారు. ఖరీఫ్‌లో ఎంతో కొంత ధాన్యం ఇవ్వాలంటూ పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. అయితే ఇందారంలో ఆ మిల్లర్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆఫీసులో అధికారిని మేనేజ్ చేసుకుని అనుమతి తెచ్చుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక జిల్లా అధికారులు మిల్లులో ధాన్యం ఉందా? లేదా? అని ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) చేసి రిపోర్టు ఇస్తూ, ఆ మిల్లు బకాయిలు పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ మిల్లు విషయంలో మాత్రం ఎవర్ని మేనేజ్ చేసుకున్నారో కానీ చివరకు కొనుగోలు కేంద్రాల ట్యాగింగ్ పూర్తి ధాన్యం దించుకునే పనిలో పడ్డారు. మంగళవారం సాయంత్రం నుంచే ధాన్యం దించుకుంటున్నారు. అదే సమయంలో బియ్యం కొనుగోలు చేసి మరీ పౌరసరపరాల శాఖకు అప్పగిస్తున్నారు. తమకు ఇవ్వకుండా ఆ మిల్లుకు అవకాశం ఇచ్చినందుకు మంచిర్యాల, భూపాలపల్లిలో అనుమతి కోసం ఎదురుచూస్తున్న 14మంది మిల్లర్లు ఈ వ్యవహారాన్ని కూపీ లాగుతున్నట్లు సమాచారం.


