ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌... | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌...

Published Sat, Sep 16 2023 12:38 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు. కొంతకాలంగా ‘నల్లాల’ దంపతులు పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరిపారు.

పార్టీలో తగు ప్రాధాన్యం కల్పిస్తామనే హామీ మేరకు ‘హస్తం’ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, నల్లాల దంపతులతోపాటు వారి ఇద్దరు కుమారులకు శ్రావణ్‌, సందీప్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు దుర్గం నరేశ్‌, బింగి శివకిరణ్‌, ముజాహిద్‌, ఇందాజ్‌, అనిల్‌ ప్రభాకర్‌ తదితరులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నల్లాల ఓదెలు ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అందరూ స్థానికుడైన తనను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని తెలిపారు. స్థానికేతరుడు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు.

రెండోసారి కాంగ్రెస్‌కే మొగ్గు..
మూడుసార్లు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓదెలు, జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న భాగ్యలక్ష్మికి పార్టీలో సుముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలుత బీజేపీవైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ చివరకు కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారు. గతేడాది మే 19న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తన కుమారులతో కలసి టీఆర్‌ఎస్‌ను వీడారు. ఢిల్లీలో అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆర్నెల్లు తిరగకుండానే అక్టోబర్‌ 5న తిరిగి ‘కారు’ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి గులాబీ పార్టీని వీడి.. హస్తం గూటికి చేరారు.

ఫలించని బుజ్జగింపులు
‘నల్లాల’ దంపతులు అసంతృప్తితో ఉండి, పార్టీ మారుతారని తెలిసిన క్షణం నుంచే పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రంగంలోకి దిగారు. వారిని పలువిఽధాలుగా బుజ్జగించారు. అయితే అవేవి ఫలించలేదు. గతంలో పార్టీ మారినప్పుడు వారికి ఇచ్చిన హామీలు నేరవేర్చకపోవడం, రాజకీయంగా ఇబ్బందిగా మారడంతో మరోసారి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ మారకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నల్లాల లెక్క చేయకుండా ‘కారు’ దిగారు.

చెన్నూరు నుంచే పోటీ?
కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో చెన్నూరు నుంచే నల్లాల ఓదెలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రధాన ప్రత్యర్థిగా ఉండడంతో ఆయన్ను ఓడించేందుకు, సానుభూతిని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా నాయకత్వం, చెన్నూరు నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారంతా ఓదెలుకు మద్దతు ఇస్తారో లేదో తేలాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకత్వం నుంచి ఆశించిన మేర మద్దతు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కొత్త, పాత కలయిక ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement