చల్లబడ్డ వాతావరణం | - | Sakshi
Sakshi News home page

చల్లబడ్డ వాతావరణం

Mar 19 2026 8:28 AM | Updated on Mar 19 2026 8:28 AM

● రోజంతా ముసురు ● నేలరాలిన మామిడికాయలు ● జిల్లాలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం

మంచిర్యాలఅగ్రికల్చర్‌/నెన్నెల/చెన్నూర్‌రూరల్‌: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం కురిసిన అకాల వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో 9.5మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మందమర్రి మండలంలో 35.8 మిల్లీమీటర్లు, నస్పూర్‌లో 27, బెల్లంపల్లిలో 26.4, భీమినిలో 17.6, మంచిర్యాలలో 13.2, కన్నెపల్లిలో 12.9, కాసిపేటలో 9, హాజీపూర్‌లో 8.2, తాండూర్‌లో 6.5, వేమనపల్లిలో 5.6, జైపూర్‌లో 4.8, నెన్నెలలో 3.1, భీమారంలో 2.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆయా మండలాల్లో గాలివానకు మామిడి కాయలు, పిందెలు నేలరాలాయి. మొక్కజొన్న, వరి పంట నేలవాలింది. మరో రెండ్రోజులు వాతావరణ శాఖ వర్ష సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

తడిసిన మిర్చి

చెన్నూర్‌: చెన్నూర్‌ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మిర్చి పంట తడిసింది. చెన్నూర్‌, కోటపల్లి మండలాల్లో రూ.10 లక్షల విలువైన మిర్చి పంట దెబ్బతిన్నది. మిర్చి పంట నల్లబడి తాలుగా మారుతోందని రైతులు పేర్కొంటున్నారు. చేన్లలో ఆరబెట్టిన మిర్చిపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పారు.

కేకే–ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

మందమర్రిరూరల్‌: మందమర్రి ఏరియాలో బుధవారం తెల్ల వారు జాము నుంచి కురిసిన అకాల వర్షానికి కేకే–ఓసీలో సు మారు నాలుగు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోజంతా కురిసిన వర్షానికి ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 85 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టితీత పనులకు ఆటంకం ఏర్పడిందని ఓసీ ప్రాజెక్ట్‌ ఆఫీ సర్‌ మల్లయ్య తెలిపారు.

గాలివానకు గాయపడిన అరుదైన పక్షి

మంచిర్యాలక్రైం: గాలివానకు బుధవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌ రోడ్డు నంబరు–4లో అరుదైన పక్షి గాయపడింది. స్థానికులు ఉప్పులూరి సంతోష్‌కుమార్‌, నితిన్‌కుమార్‌ అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌కు అప్పగించారు. లోసి ఇఫ్సీ అనే అరుదైన పక్షి జాతికి చెందినదిగా గుర్తించి పశువైద్యశాఖ అధికారి వద్ద చికిత్స అందించారు. స్థానిక ఎఫ్‌ఆర్‌వో రత్నాకర్‌రావు, బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ సంరక్షణలో ఉంచారు. స్థానికులను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement