దండేపల్లి: పొలానికి నీళ్లుపెట్టేందుకు వెళ్లి విద్యుత్ మోటార్ ఆన్‌చేస్తుండగా షాక్‌కు గురై యువరైతు ప్రాణాలొదిలిన విషాద ఘ టన దండేపల్లి మండలంలోని నంబాలలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దాసరి చంద్రశేఖర్ (28) ప్రస్తుత యాసంగిలో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. హనుమాన్ దీక్ష తీసుకున్న అతను బుధవారం ఉదయం హనుమాన్ ఆలయంలో పూజ చేసుకుని పొలానికి నీళ్లుపెట్టేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో అతని భార్య అనూష పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. విషయాన్ని మామ సత్తయ్యకు చెప్పడంతో వెంటనే అతను పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడిఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు.


