గిరిజన ఆణిముత్యం.. నీట్‌లో ఆల్‌ఇండియా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్‌ | Sakshi
Sakshi News home page

గిరిజన ఆణిముత్యం.. నీట్‌లో ఆల్‌ఇండియా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్‌

Published Thu, Jun 29 2023 12:54 AM

తల్లి బుచ్చక్కతో స్రవంతి - Sakshi

దహెగాం: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ కూలీ కూతురు. చిన్న తనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించింది. తండ్రి క్యాన్సర్‌తో ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో ఆ పసి మనసులో అప్పటి నుంచే డాక్టర్‌ కావాలని తలపించింది. మా నాన్నలాగా ఎవరు మృతిచెందవద్దనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన నీట్‌ ఫలితాల్లో 427 మార్కులు సాధించగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్‌ కై వసం చేసుకుంది. కొలవార్‌ తెగలో వైద్య విద్యను పూర్తి చేస్తే తొలి విద్యార్థిని సంగర్ష్‌ స్రవంతి కానుంది.

కుటుంబ నేపథ్యం..
కుమురంభీం జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన సంగర్ష్‌ శంకర్‌, బుచ్చక్కలకు ఐదుగురు ఆడపిల్లలే. అందులో ఐదో సంతానమైన స్రవంతి 1 నుంచి 5వ తరగతి వరకు చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివింది. 6 నుంచి 10వ తరగతి వరకు దహెగాంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదివింది. పదిలో 8.2 జీపీఏ సాధించింది. 9వ తరగతి చదువుతున్న క్రమంలో తండ్రి శంకర్‌ క్యాన్సర్‌తో మృతి చెందాడు. శంకర్‌కు సరైన వైద్యం అందక చనిపోయాడని ఇరుగుపొరుగు వారు అనేవారు. అప్పుడే ఆమెలో డాక్టర్‌ కావాలనే ఆలోచన మొదలైంది. దీంతో బంధువుల సహకారంతో డీఆర్‌డీఏను సంప్రదింది హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో సీటు సాధించింది. ఇంటర్‌ బైపీసీలో 934 మార్కులు సాధించింది.

కుంగిపోకుండా చదివి..
ఇంటర్‌ పూర్తి చేసిన స్రవంతి డాక్టర్‌ కావాలని కోరిక ఉండగా ప్రైవేటులో నీట్‌ శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్‌రాల్డ్‌లో నీట్‌ శిక్షణ తీసుకుంది. మొదటి ప్రయత్నంలో నీట్‌లో సీటు కోల్పోయింది. అయినా కుంగిపోకుండా అధైర్యపడకుండా పట్టుదలతో చదివి రెండోసారి 427 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు సాధించి వైద్య విద్యకు ఎంపికై ంది. వైద్య విద్య పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొలవార్‌ తెగలో మొదటి మహిళగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

నా బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకున్నా
నా భర్త ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిండు. నాకు ఐదుగురు ఆడపిల్లలే. నలుగురు పిల్లల పెండ్లీలు చేసినా. స్రవంతి ఐదవ బిడ్డ ఆమె చిన్నప్పటి నుంచి మంచిగ చదువుకుంటుంది. స్రవంతిని డాక్టర్‌ చదివించాలని నా కోరిక నేను కూలీ పనులు చేసుకుంటు ఆమెను చదివిపిచ్చినా మేము కష్టపడినట్లు నా బిడ్డ కష్టపడవద్దని ఆమెను చదివిపించి డాక్టర్‌ చేయాలని అనుకున్న. స్రవంతి డాక్టర్‌ అయితందని అందరు అంటురు. నాకు ఆనందంగా ఉంది.
– బుచ్చక్క, స్రవంతి తల్లి, చంద్రపల్లి

పేదలకు వైద్యం అందిస్తా
సరైన వైద్యం అందక మా నాన్న చనిపోయినట్లు ఊర్లో అందరూ అనేవారు. అప్పటి నుంచే డాక్టర్‌ కావాలని అనుకున్న. కష్టపడి చదివితే సాధించవచ్చని అనుకుని నీట్‌ మొదటి సారి రాస్తే ర్యాంక్‌ రాలేదు. అయినా బాధపడకుండా రెండో సారి కోచింగ్‌ తీసుకుని ప్రయత్నం చేయగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. నాన్న లేకపోయినా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నిరుపేదలకు వైద్యం అందిస్తా.
– స్రవంతి, చంద్రపల్లి

Advertisement
 
Advertisement