కొత్తకోట రూరల్: ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం కార్డును చాకచక్యంగా మార్చి ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.80 వేలు కాజేసిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన మంద వెంకటయ్య ఈనెల 15న కొత్తకోటలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో డబ్బులు తీసేందుకు వెళ్లాడు. అక్కడ నగదు రాకపోవడంతో సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న ఇద్దరు యువకులు వెంకటయ్యను పలకరించి మాటల్లో పెట్టారు. డబ్బులు తీసేందుకు సహాయం చేస్తామని నమ్మించి అతడి ఏటీఎం కార్డును తీసుకుని పిన్ నంబర్ నమోదు చేయించారు. నగదు రావడం లేదని చెప్పి, చాకచక్యంగా అతడి కార్డును తమ వద్ద ఉన్న మరో కార్డుతో మార్చి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన ఖాతాలో డబ్బులున్నాయనే నమ్మకంతో వెంకటయ్య పంటరుణం రెన్యూవల్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఖాతాలో నగదు తక్కువగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆందోళనకు గురయ్యాడు. ఖాతా లావాదేవీలను పరిశీలించగా ఈనెల 16న వనపర్తిలో రూ.40వేలు, 17న హైదరాబాద్‌లో మరో రూ.40 వేలు ఏటీఎం ద్వారా డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతో తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా అది తనది కాదని గుర్తించి మోసపోయినట్లు తెలుసుకున్నాడు. వెంటనే కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


