మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) పరిధిలో పరిశోధనలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచే దిశగా యూనివర్సిటీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూతన పీహెచ్‌డీ రెగ్యులేషన్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. వీటి ప్రకారం గతంతో పోలిస్తే పరిశోధన సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. యూనివర్సిటీతోపాటు గద్వాల, కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాలకు కూడా కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. మొత్తం మీద 60కిపైగా సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో పీజీ పూర్తిచేసి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
పెరిగిన ప్రొఫెసర్ల సంఖ్య.. సీట్లకు ఊతం
యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ ఎనిమిది మంది, అసోసియేట్ ప్రొఫెసర్ నలుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరుగురు పరిశోధక విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో పీయూలో జైపాల్‌రెడ్డి, పిండిపవన్‌కుమార్ ప్రొఫెసర్ హోదాలో ఉండగా.. ఇటీవల మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్‌లకు ప్రొఫెసర్ హోదా కల్పించారు. దీంతో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే అధ్యాపకుల సంఖ్య పెరిగింది. మరోవైపు గతంలో ప్రవేశం పొందిన పలువురు పరిశోధకులు తమ అధ్యయనాలను పూర్తిచేసి పట్టాలు పొందడంతో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిణామాలు కొత్తగా సీట్లు అందుబాటులోకి రావడానికి దోహదం చేయనున్నాయి. త్వరలోనే ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎంవీఎస్‌కు రీసెర్చ్ సెంటర్ హోదా
మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు తొలిసారిగా రీసెర్చ్ సెంటర్ హోదా కల్పించారు. గతేడాది కళాశాల యాజమాన్యం చేసిన దరఖాస్తును పరిశీలించిన పీయూ అధికారులు తాజాగా ఆమోదం తెలిపారు. వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం, వాణిజ్యశాస్త్రం, ఆంగ్లం, అర్థశాస్త్రం, తెలుగు.. మొత్తం ఏడు సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, సత్యనారాయణగౌడ్, సత్యభాస్కర్‌రెడ్డితోపాటు ఇతర అర్హులైన రెగ్యులర్ అధ్యాపకులు పరిశోధన గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. ప్రారంభ దశలో ఒక్కో అధ్యాపకుడికి ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రవేశాలన్నీ పీయూ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారానే జరగనున్నాయి. పరిశోధనల పర్యవేక్షణ కూడా యూనివర్సిటీ పరిధిలోనే కొనసాగుతుంది.
పీయూలో 60 పీహెచ్‌డీ సీట్లకు అవకాశం
నూతన పీహెచ్‌డీ రెగ్యులేషన్స్ విడుదల
యూనివర్సిటీతోపాటు మూడు పీజీ సెంటర్లకు వర్తింపు
ఎంవీఎస్ కళాశాలకు తొలిసారిగా రీసెర్చ్ సెంటర్ హోదా
ఏడు సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం
త్వరలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం


