మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఇక ‘ఎన్ని ఎకరాల్లో ఏ పంట?’ అన్న లెక్కలు కాగితాలకే పరిమితం కావు. రైతు పొలంలో ఏ పంట సాగు చేస్తున్నాడు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేశాడు.. అన్నది క్షేత్రస్థాయిలోనే డిజిటల్‌గా నమోదవుతోంది. దీంతో జిల్లాలో వాస్తవ సాగు విస్తీర్ణం, పంటల వివరాలపై పక్కా లెక్కలు అందుబాటులోకి రానున్నాయి. వానాకాలం సాగు వివరాల నమోదుకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే–2026లో మహబూబ్‌నగర్ జిల్లా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 41.8 శాతం క్షేత్రాల సర్వే పూర్తిచేసి రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో సర్వే చేయాల్సిన 7,36,776 క్షేత్రాల్లో 3,07,744 క్షేత్రాలను పరిశీలించి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. ఈనెల 19న ఒక్కరోజే 13,388 క్షేత్రాల సర్వే పూర్తిచేయడం గమనార్హం.
పొలంలోకి వలంటీర్
గతంలో పంటల సాగు వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించి నమోదు చేసేవారు. అయితే పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించకుండానే వివరాలు నమోదయ్యే సందర్భాలు ఉండటంతో కచ్చితత్వంపై సందేహాలు తలెత్తేవి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని 306 రెవెన్యూ గ్రామాల్లో 305 గ్రామాలను సర్వేకు కేటాయించారు. 7,06,284 ఫార్మ్ ప్లాట్లు సర్వే జాబితాలో ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున 305 మంది వలంటీర్లను నియమించారు. వీరిలో 292 మంది యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని సర్వే ప్రారంభించారు.
2.64 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 2,64,235 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్కల్లో నమోదైంది. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఈ వివరాలను మరింత కచ్చితంగా నిర్ధారించనున్నారు. సర్వే పూర్తయితే మండలం, గ్రామం, రైతు, పంట, విస్తీర్ణం వారీగా వాస్తవ సాగు పరిస్థితిపై స్పష్టత రానుంది.
కొనుగోళ్లలోనూ ఉపయోగకరం
పంట కొనుగోళ్ల సమయంలో సాగు వివరాలపై తలెత్తే వివాదాలకు డిజిటల్ సర్వే పరిష్కారంగా మారనుంది. రైతు పొలంలో ఉన్న పంటను ఫొటోతో సహా నమోదు చేయడంతో సాగుకు సంబంధించిన డిజిటల్ ఆధారం అందుబాటులో ఉంటుంది. భవిష్యత్‌లో రైతు సంక్షేమ పథకాలు, పంటల బీమా, పరిహారం, పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టం అంచనా వంటి అంశాల్లో ఈ సమాచారం ఉపయోగపడనుంది. ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతోంది? ఎంత విత్తనం, ఎరువు అవసరం? అనే దానిపై ప్రభుత్వానికి వాస్తవిక సమాచారం లభించనుంది.
రోజువారీగా పర్యవేక్షణ
వలంటీర్లు యాప్‌లో అప్‌లోడ్ చేసే ప్రతి చిత్రానికి రూ.7 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. సర్వే పురోగతిని వ్యవసాయశాఖ అధికారులు రోజువారీగా సమీక్షిస్తున్నారు. గ్రామాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి పూర్తయిన క్షేత్రాల వివరాలను పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేసి జిల్లాలో వాస్తవ సాగు, పంటలపై సమగ్ర డిజిటల్ డేటాను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఏ పంటో.. అక్కడే నమోదు
వలంటీర్ నేరుగా పొలాన్ని సందర్శించి రైతు సాగు చేస్తున్న పంట వివరాలను యాప్‌లో న మోదు చేస్తారు. పంట రకం, విస్తీర్ణంతో పాటు పొలం ఫొటోను కూడా అప్‌లోడ్ చేస్తారు. ఒకే భూమిలో వేర్వేరు పంటలు సాగు చేసినా వాటి ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో కాగితాలపై ఉన్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసాలు తగ్గనున్నాయి.
రాష్ట్రంలో 18వ స్థానం.. 41.8 శాతం క్షేత్రాల సర్వే పూర్తి
ఇకపై జిల్లాలో పక్కాగా సాగు లెక్క
305 రెవెన్యూ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
ప్రతి గ్రామానికి ఒక వలంటీర్.. యాప్‌లో పంట వివరాల నమోదు
జిల్లాలో ఇప్పటివరకు 2,64,235 ఎకరాల్లో సాగు


