అమరచింత/ గద్వాల క్రైం/ధరూరు: రోజురోజుకూ జూరాల ప్రాజెక్టు వద్ద జల వివాదం ముదురుతోంది. ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని రైతులు రెండు, మూడు రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తుండగా.. వీరికి వివిధ పార్టీల నాయకులు తోడు కావడంతో ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం బీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయకట్టు రైతులు, వివిధ ప్రాంతాల నాయకులు పెద్దఎత్తున జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను హౌస్ అరెస్టు చేయగా.. పోలీసుల నుంచి తప్పించుకుని జూరాల ప్రాజెక్టుకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని నందిమళ్ల క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు వచ్చిన రైతులు ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడటంతో తోపులాటలు చోటుచేసుకొని రణరంగాన్ని తలపించింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను జీపులో ఎక్కించుకుని వెళ్తుండగా రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు రహదారికి అడ్డంగా రాళ్లు, ముళ్లకంచె వేయడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి.. చిట్టెంను కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసులతో రైతుల వాగ్వాదం..
ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి వచ్చిన రైతులతో నందిమళ్ల క్యాంపు కాలనీ కిక్కిరిసిపోయింది. పంటలకు సాగునీరు ఇస్తే ఇక్కడికి ఎందుకు వస్తామని, మీతో గొడవెందుకు పెట్టుకుంటామంటూ జూరాల ఆయకట్టు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో నాలుగు గంటల పాటు రైతులు, పోలీసు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి జూరాల సమాంతర కాల్వ వరకు రైతులు చేరుకోవడంతో అక్కడే ఉన్న మరికొందరు పోలీసు బలగాలు వారిని అడ్డుకోగా తోపులాటలు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రాజెక్టుపై ట్రాఫిక్ ఆంక్షలను పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
10 కి.మీ., మేర ట్రాఫిక్ జాం
మరోవైపు గద్వాల– ఎర్రవల్లి రహదారి మార్గంలోని జమ్మిచేడ్ వద్ద జూరాల కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు పెద్దఎత్తున రోడ్డుపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఆ మార్గంలో సుమారు 10 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు స్నిగ్ధారెడ్డి, బాసు శ్యామల తదితరులు మద్దతు ప్రకటించి మాట్లాడారు. అలాగే రైతుల వద్దకు అదనపు కలెక్టర్ మధన్‌మోహన్, ఎస్‌ఈ కేశవరావు వచ్చి సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు చెప్పారు. ఈ క్రమంలో మహిళా రైతులు కంటతడి పెడుతూ అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కి నీటిని విడుదల చేయాలని కోరారు. 24 గంటల్లోగా నీటిని విడుదల చేయకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
● రేవులపల్లి, భీంపురం, పెద్దచింతరేవుల గ్రామాల రైతులు కుడి కాల్వ వద్ద ధర్నా చేసందుకు సిద్ధపడగా.. పోలీసులు వారిని మిషన్ భగీరథ హెడ్ వర్క్స్ గట్టు సమీపంలోని జీరో పాయింట్ వద్ద అడుక్డకున్నారు. దీంతో రైతులు అక్కడే కూర్చొని ధర్నా చేశారు. వీరికి వివిధ పార్టీల నాయకులు పద్మ, హన్మంతు, గోపాల్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపి ధర్నాలో కూర్చున్నారు.
జూరాల సమాంతర కాల్వలో రైతుల నిరసన
భారీగా పోలీసుల మోహరింపు
జూరాల ప్రాజెక్టుకు చేరుకొనే ప్రధాన రహదారులపై పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అమరచింత మండలం మస్తీపురం, కిష్టంపల్లి, నందిమళ్ల ఎక్స్‌రోడ్లతోపాటు ఆత్మకూర్ మండలం మూలమళ్ల శివారు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరింపజేశారు. దీంతో ప్రాజెక్టు రహదారిపై నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు పోలీసులు, స్పెషల్ బెటాలియన్‌తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితులను సమీక్షించడానికి వనపర్తి ఎస్పీ సునీతరెడ్డి జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. సీఐ శివకుమార్‌ను అడిగి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు.
జూరాల వద్ద ముదురుతున్న సాగునీటి వివాదం
బీఆర్‌ఎస్ పిలుపుతో
తరలివచ్చిన అన్నదాతలు
ఎక్కడికక్కడే నాయకుల అరెస్టు
రైతులు, పోలీసుల మధ్య
తోపులాట.. ఉద్రిక్తం
ప్రాజెక్టు వెళ్లే దారుల చుట్టూ భారీగా పోలీసుల పహారా


