● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల: జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. జూరాల ముట్టడికి తిరుమల హిల్స్‌లోని తన నివాసం నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. జూరాలలో 8.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తాగునీటి పేరుతో పంటలకు నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. జూరాల నుంచి తాగునీటికి ఒక టీఎంసీ సరిపోతుందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాలు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జూరాల నీటిని విడుదల చేసి సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసిన పంటలను కాపాడాలని కోరారు.ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని ఆరోపించారు. రైతులు సాగుకు వెళ్లకముందే నీటి లభ్యతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ముందుచూపుతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకే రిజర్వాయర్లను నిర్మించారని, 70 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేశారని తెలిపారు. కరివెన వరకు రిజర్వాయర్లను నింపి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగపడేవని పేర్కొన్నారు. కేఎల్‌ఐ పంప్ మోటర్లను నిరంతరాయంగా నడపాల్సి ఉండగా వాటిని నిలిపివేయ డం వల్ల మోటర్లు దెబ్బతినే ప్రమాదం ఉందన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే అధికారులతో సమీక్షించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నర్సిములు, శ్రీనివాస్‌యాదవ్, మురళి పాల్గొన్నారు.


