ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

Sep 22 2026 12:48 AM | Updated on Sep 22 2026 12:48 AM

ప్రతి వారం ఓ గ్రామ పంచాయతీని సందర్శించాలి

సమస్యల పరిష్కారంపై ఫాలోఅప్‌ చేయాలి: కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): మండలాలు, నియోజకవర్గాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ప్రతి వారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక గ్రామ పంచాయతీని తప్పనిసరిగా సందర్శించాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ ప్రస్తుతం లేనందున ప్రత్యేక అధికారుల బాధ్యతలు మరింత కీలకమయ్యాయని తెలిపారు. ప్రతి సోమవారం ఒక్కో అధికారికి గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ వారంలో బుధవారం లేదా అనుకూలమైన రోజున తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. గ్రామ పర్యటనలో సర్పంచ్‌, పంచాయతీ సిబ్బంది, ప్రజలతో మాట్లాడి సమస్యలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, తాగునీరు, పారిశుద్ధ్య తదితర అంశాలను పరిశీలించాలన్నారు. ప్రతి అధికారి కనీసం రెండు పాఠశాలలను సందర్శించాలని, అందులో ఒకటి రెసిడెన్షియల్‌ పాఠశాల ఉండేలా చూడాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, వసతి, తాగునీరు, మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించాలన్నారు. అలాగే పీహెచ్‌సీ, హెల్త్‌ సెంటర్‌ లేదా సబ్‌సెంటర్‌ను సందర్శించి మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్యసేవలను పరిశీలించాలని ఆదేశించారు. క్షేత్ర పర్యటనలను సాధ్యమైనంత వరకు ముందస్తు సమాచారం లేకుండా నిర్వహించాలని, గుర్తించిన సమస్యలపై వారం, పది లేదా పదిహేను రోజుల తర్వాత ఫాలోఅప్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. అక్టోబర్‌ 6న జరిగే దిశ సమావేశానికి కేంద్ర పథకాలు, ఎంపీ ల్యాడ్స్‌ పనులు, పెండింగ్‌ అంశాలపై నివేదికలు, గత సమావేశానికి సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ హరిప్రియ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయి శివాని, డీఆర్‌ఓ నిర్మల, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, హౌసింగ్‌ పీడీ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయాలి

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement