● క్లాక్‌టవర్ కూడలి వైపు వాహనాల అనుమతి ఉండదు
● ఈనెల 25వరకు ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 23న నిర్వహించనున్న శోభాయాత్ర నేపథ్యంలో సోమవారం క్లాక్‌టవర్, బైపాస్ రోడ్డు, మూడు తాత్కాలిక కృత్రిమ చెరువులు, నిమజ్జన రూట్లను పోలీసు అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. శోభాయాత్ర సందర్భంగా ప్రధాన రోడ్లు, కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 25 ఉదయం 6 గంటల వరకు క్లాక్‌టవర్ కూడలి వైపు అన్ని రకాల వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. హైదరాబాద్, భూత్పూర్, రాయచూర్, కోయిలకొండ, చించోళి తదితర ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్‌లోకి వచ్చే భారీ వాహనాలు తప్పనిసరిగా బైపాస్ రోడ్డునే వినియోగించాలని సూచించారు. నగరంలోని ఇతర వాహనదారులు క్లాక్‌టవర్ వైపు రాకుండా ట్రాఫిక్ పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. శోభాయాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, రాజేందర్‌రెడ్డి, క్రిష్ణ పాల్గొన్నారు.


