నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) నీటిని కేఎల్‌ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్‌లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్‌ఎల్‌ఐ ద్వారా నార్లాపూర్‌లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్‌ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది.
పీఆర్‌ఎల్‌ఐ నీటితో కొత్త వెసులుబాటు
శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేఎల్‌ఐ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక పంపు పనిచేస్తే సుమారు 800 క్యూసెక్కులు, రెండు పంపులు పనిచేస్తే 1,600 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే సామర్థ్యం ఉంది. అయితే విద్యుత్ సమస్యలు, పంపుల నిర్వహణ, మరమ్మతుల కారణంగా నిరంతరాయంగా పంపింగ్ చేయడం కష్టంగా మారుతోంది. దీంతో కేఎల్‌ఐ కాల్వలకు ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పీఆర్‌ఎల్‌ఐ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి ఎల్లూరుకు మళ్లించే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నారు.
రోజుకు 0.3 టీఎంసీ ఎత్తిపోత
పీఆర్‌ఎల్‌ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్‌లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్‌లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్‌ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు.
అటు నుంచి నీటి తరలింపు..
ఇటు వినియోగంపై ఆందోళన
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ.. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలిస్తున్నదని తెలంగాణకు చెందిన నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు, వెలిగొండ ద్వారా 3,500 క్యూసెక్కులు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి తదితర మార్గాల ద్వారా మరో 3,500 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. మొత్తం మీద సుమారు 15 వేల క్యూసెక్కుల వరకు నీరు తరలిపోతే శ్రీశైలం నిల్వలు వేగంగా తగ్గే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తనకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. పీఆర్‌ఎల్‌ఐ పంపులను అందుబాటులోకి తెచ్చి, నార్లాపూర్–ఎల్లూరు అనుసంధానాన్ని వినియోగిస్తే కేఎల్‌ఐకి నీటి లభ్యత పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఆ అవకాశం ఉంది
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని పంపించే అవకాశం ఉంది. రెండు రిజర్వాయర్ల మధ్య ఇంటర్‌లింక్ నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి నీటిని స్లూయిస్ ద్వారా కేఎల్‌ఐకి సంబంధించిన ఎల్లూరు రిజర్వాయర్‌కు పంపించడానికి వీలుంది.
– లోకిలాల్ నాయక్, కేఎల్‌ఐ డీఈఈ
నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు మళ్లించే అవకాశం
ఇంటర్‌లింక్ స్లూయిస్‌తో రోజూ 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు
కేఎల్‌ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం


