పాలమూరు: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. తొలిరోజు ఏనుగొండ కేజీబీవీ అర్బన్ పాఠశాలలో డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ సెక్టార్‌లో చదువుతున్న విద్యార్థులకు దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. గతంలో పరీక్షల్లో కంటి సమస్యలు గుర్తించిన విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేయడంతోపాటు, ప్రస్తుతం కొత్తగా కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌బీఎస్‌కేకు చెందిన ఆరు బృందాలు తొలిరోజు మొత్తం 1,311 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాయి. వీరిలో 124 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత విద్యార్థులకు అవసరమైన అద్దాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ నర్సమ్మ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికాంత్, వైద్యులు పులి విద్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


