బోనస్‌ కావాలంటే.. నమోదు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ కావాలంటే.. నమోదు తప్పనిసరి

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో సన్న వరి సాగు చేస్తున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సన్న రకం ధాన్యం పండించే ప్రతి రైతుకు క్వింటాలుకు అదనంగా రూ. 500 చొప్పున బోనస్‌ అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు నిర్ధేశిత నిబంధనలను పాటించి సకాలంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం–2026లో జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సన్న, దొడ్డు రకాల వరిని రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అర్హులైన రైతులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచించింది. ఈనెల 17వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం బోనస్‌కు నిర్దేశించిన సన్న రకాలలో తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048), బీపీటీ 5204, జై శ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 8715, డబ్ల్యూజీఎల్‌–44 ఉన్నాయి. ఈ ఏడు రకాల్లో ఏదైనా సాగు చేసిన రైతులు మాత్రమే తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

విత్తన దుకాణంలోనే నమోదు

రైతులు సన్న రకం వరి విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు సంబంధిత విత్తన దుకాణంలోనే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. రైతుల వద్ద సొంతంగా ఉన్న సన్న రకం విత్తనాలను సాగు చేసినట్లయితే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. విత్తన దుకాణంలో అప్పట్లో నమోదు చేసుకోని రైతులు విత్తనం కొనుగోలు చేసిన రశీదును చూపించి అదే దుకాణంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నమోదైన వివరాలు డిజిటల్‌గా భద్రపరుచబడతాయని, భవిష్యత్తులో బోనస్‌ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులు సకాలంలో నమోదు చేసుకోవాలని కోరారు.

డిజిటల్‌ క్రాప్‌ సర్వేలోనూ వివరాలు

ప్రస్తుతం జిల్లాలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలం వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పంట వివరాలను సరైన రీతిలో నమోదు చేయించుకోవాలి. బోనస్‌ పొందేందుకు అవసరమైన వివరాల నమోదులో రైతులు సహకరించాలి – గోవింద్‌నాయక్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement