● ఆరుగురిపై కేసు.. నలుగురి అరెస్టు
మణికొండ: కల్లు తయారీలో ఉపయోగించే అల్ఫాజోలంను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.24.18 లక్షల విలువైన 1.931 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. సహాయ కమిషనర్ జి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన లింగరాజుగౌడ్, టి.ఆంజనేయులు, ఆర్.రమేష్, కాటమయ్యలు మరో ఇద్దరి నుంచి అల్ఫాజోలం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మంచిరేవులలో నిఘా పెట్టిన అధికారులు వ్యాగనార్ కారులో తరలిస్తున్న ఇద్దరి నుంచి 751 గ్రాములు, ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో ఇద్దరి నుంచి 1.18 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సేఊర కృష్ణ, ఎస్‌ఐ రమేష్, ట్రైనీ ఎస్‌ఐలు రమణ, రమేష్, గిరిలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురితో పాటు కారును, ద్విచక్రవాహనాన్ని గండిపేట ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో అల్ఫాజోలం పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్ జై హరికిషన్ అభినందించారు.
బైక్‌ను ఢీకొన్న డీసీఎం..
మహిళ దుర్మరణం
శంషాబాద్: అతివేగం.. నిర్లక్ష్యంతో ఓ డీసీఎం వాహనం బైక్‌పై వెళుతున్న వారిని ఢీ కొనడంతో మహిళ దుర్మరణం చెందిన సంఘటన శంషాబాద్ సిద్దాంతిలో చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ తన భార్య సోని(35) కుమార్తె శాన్వితో కలిసి హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళుతున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సిద్దాంతి రైల్వేగేటు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి ఐచర్ డీసీఎం వాహనం వేగంగా ఢీ కొనడంతో వెనకాల కూర్చున్న సోని కిందపడిపోయింది. డీసీఎం వెనకభాగం టైరు కూడా ఆమె మీది నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్యాంసుందర్‌తో పాటు కుమార్తెకు కూడా గాయాలు కావడంతో వారికి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డీసీఎం డ్రైవర్ కర్ణాటక రాయచూర్‌కు చెందిన బస్వరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సమీక్షించిన మంత్రి
అదె సమయంలో అటుగా వెళుతున్న మంత్రి వాకిటి శ్రీహరి రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించి కారులోంచి దిగారు. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులతో పరిస్థితిని సమీక్షించి గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లే వరకు ఉన్నారు. సిద్దాంతి వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారుల ఎలాంటిచర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.


