లింగాల: కడుపులో బిడ్డను మోస్తున్న ఆ ఇల్లాలు భర్త చేతి లోనే బలైంది. ఆరు నెలల గర్భిణి అయిన గాడ్డుల శివాని(26)ను ఆమె భర్త పరుశరాముడు హత్య చేసి నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఆమె బాత్రూంలో కాలుజారి పడిపోయి స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. ఘటనను ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. దారారం గ్రామానికి చెందిన గాడ్డుల పరుశరాముడికి వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన శివానితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. కొంతకాలం మండల కేంద్రంలోని ఓ బేకరిలో పనిచేసిన పరుశరాముడు రెండు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అల్వాల్‌లో ఉంటూ ర్యాపిడ్ వాహనం నడుపుతున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, భార్యపై అనుమానం పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న పరుశరాముడు శివానిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె బాత్రూంలో కాలుజారి పడిపోయి స్పృహ కోల్పోయిందని మామ వెంకటేష్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. వారు అక్కడికి చేరుకునేలోపే శివాని మృతిచెందింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం దారారం తీసుకొచ్చారు. శివాని మృతదేహాన్ని అత్తింటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆమెను హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలను తిరిగి ఇవ్వాలని పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదరడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. గర్భిణి అయిన శివాని మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటన నేపథ్యంలో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చంద్రకాంత్, జయన్నతో పాటు లింగాల, బల్మూర్, ఉప్పునుంతల పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..
పోలీసుల ఎదుట నేరం అంగీకారం
మృతదేహంతో అత్తింటి ముందుబంధువుల ఆందోళన..
లింగాల మండలం దారారంలో ఉద్రిక్తత


