● ప్రాజెక్టు ఈఈ వాహనాన్ని
అడ్డుకున్న రైతులు
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలం సున్నపు తండా సమీపంలోని కేఎల్‌ఐ ప్రాజెక్టు డీ–5 పంటకాల్వ నుంచి సాగునీరు విడుదల చేయాలని మంగళవారం కుడికిల్ల, నార్లాపూర్, సున్నపుతండా తదితర గ్రామాల రైతులు డీ–5 కాల్వ దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల నిమిత్తం పంటకాల్వ లింకును అధికారులు కట్ చేయడంతో మూడురోజుల నుంచి కాల్వకు సాగునీరు రావడం లేదన్నారు. దాదాపు వెయ్యి ఎకరాలలో పంట కాల్వ కింద పంటలు చేశామన్నారు. ఆ పంటలు మూడురోజులుగా సాగునీరు రాకవపోడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పంట కాల్వకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలుపాటు నిరసన తెలపడంతో ప్రాజెక్టు ఈఈ అమర్‌సింగ్‌తోపాటు అధికారులు రైతుల వద్దకు చేరుకోగా.. అధికారులను రైతులు చుట్టుముట్టి ఆయన వాహనాన్ని అడ్డంగించారు. ఈ సందర్భంగా ఈఈ అమర్‌సింగ్ మాట్లాడుతూ.. భగీరథ పనులు జరుగుతుందున కాల్వ లింకును కట్ చేయడం జరిగిందని తాత్కాలికంగా రిజర్వాయర్ నుంచి కాల్వలకు 50 హెచ్‌పీ మోటార్లతో మూడు పంపుల నుంచి సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైతే హెచ్‌పీని పెంచి ఎక్కువ మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. రైతుల పంటలు కాపాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. కార్యక్రమంలో రైతులతోపాటు సున్నపుతండా మాజీ ఎంపీటీసీ శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ మండల సమన్వ కమిటీ సభ్యులు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


