అంబులెన్స్‌ ఢీ కొట్టడంతో.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ ఢీ కొట్టడంతో.. ఒకరు మృతి

Sep 16 2026 4:19 AM | Updated on Sep 16 2026 4:19 AM

తాగునీటి కోసం వాహనాన్ని ఆపిన సమయంలో ప్రమాదం

చిన్నచింతకుంట: ఆగి ఉన్న టీవీఎస్‌ ఎక్సల్‌ వాహనాన్ని అంబులెన్స్‌ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని లాల్‌కోట ఎక్స్‌రోడ్డు చౌరస్తా వద్ద రైచూర్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి మొగిలయ్య(53) తన భార్య చెన్నమ్మతో కలిసి టీవీఎస్‌ ఎక్సల్‌పై తీలేరు నుంచి దేవరకద్రకు బయలుదేరారు. లాల్‌కోట చౌరస్తా వద్ద మంచినీటి కోసం వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. చెన్నమ్మ నీటి కోసం సమీపంలోని హోటల్‌కు వెళ్లగా.. మక్తల్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వైపు వెళ్తున్న మినీ అంబులెన్స్‌ ఆగి ఉన్న టీవీఎస్‌ ఎక్సల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనంపై కూర్చున్న మొగిలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడు..

జడ్చర్ల: బాదేపల్లి నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందినట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. సీఐ కథనం మేరకు.. మండలంలోని పెద్దపల్లికి చెందిన కోళ్ల రాజశేఖర్‌రెడ్డి(27) ఆదివారం రాత్రి మోటర్‌ బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య చికిత్స కోసం అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విశమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి తండ్రి భగవంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అనుమానాస్పదంగా కూలీ మృతి

మరికల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ కూలీ మృతిచెందిన ఘటన సోమవారం ఎక్లాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎక్లాస్‌పూర్‌కు చెందిన చాంద్‌పాషా(48)అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరిపంటకు ఫర్టిలైజర్‌ మందును చల్లేందుకు కూలీగా వెళ్లాడు. అయితే పొలంలో కరెంట్‌ తీగలు కూడా కిందకు ఉండడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతిచెందాడా, లేక యూరియా గుళికలతో కూడిన మందు విషప్రభావం వల్ల మృతిచెందాడా అన్న విషయం తెలియాల్సి ఉందని ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్‌ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నడుము నొప్పి భరించలేక వృద్ధురాలి బలవన్మరణం

మానవపాడు: నడుము, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న 86 ఏళ్ల వృద్ధురాలు పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందమ్మ కొంతకాలంగా నడుము, మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. సోమవారం కుమార్తె, అల్లుడు పొలానికి వెళ్లడంతో ఇంట్లో 12 ఏళ్ల మనవరాలితో ఉంది. నొప్పి తీవ్రతతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన మనవరాలు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు గోవిందమ్మను మానవపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇథనాల్‌ కంపెనీలో

వలస కార్మికుడు..

మరికల్‌: చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీలో ఓ వలస కార్మికుడు గదిలో ఉరేసుకొని మృతిచెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తుఫాన్‌ మండల్‌(19) వలస కార్మికుడు ఆదివారం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement