గ్యాస్‌.. గోస | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌.. గోస

Sep 13 2026 1:12 AM | Updated on Sep 13 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఇంట్లో పొయ్యి వెలగాలంటే గ్యాస్‌ ఉండాలి.. సిలిండర్‌ ఖాళీ అయితే వెంటనే మరో సిలిండర్‌ రావాలి. కానీ, ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్‌ బుకింగ్‌ చేసినా సరైన సమయంలో సిలిండర్‌ అందకపోవడం, కొత్త కనెక్షన్‌ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడం, అదనపు సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా రేషన్‌కార్డులు పొందిన కుటుంబాలు, కొత్తగా పెళ్లయిన జంటలు గ్యాస్‌ కనెక్షన్‌ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గృహ అవసరాలకు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

కొత్త జంటలకు.. గ్యాస్‌ గండం

వంట గ్యాస్‌ కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారు, కొత్తగా పెళ్లయిన జంటలు గ్యాస్‌ కనెక్షన్‌ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గతంలో దరఖాస్తు చేసుకున్న అనేక మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరికొందరు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఆదేశాలతో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ కంపెనీలు కొత్త గ్యాస్‌ కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ అడిగిన వెంటనే లభించేది. ప్రస్తుతం గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు ఉన్నందున కొత్త కనెక్షన్ల జారీకి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గృహ అవసరాలకు సంబంధించి కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు ఇవ్వడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే గృహ అవసరాలకు కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కొత్తగా పెళ్లయిన జంటలకు శాపంగా మారాయి. కొందరు కొత్త గ్యాస్‌ సిలిండర్‌ బాధ్యత అత్తామామలపై పెడుతుండగా.. డబుల్‌ సిలిండర్లు ఉన్నవారు ఒక సిలిండర్‌ కొత్త జంటలకు ఇచ్చి పంపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు డబుల్‌ సిలిండర్లు ఉన్నవారి నుంచి అధిక ధర చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గంగా ఇండక్షన్‌ స్టౌలు కొందామంటే మార్కెట్‌లో ఇవి వెంటనే దొరకడం లేదు. కొత్త కనెక్షన్లు మళ్లీ ప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాయా..? అని అందరూ ఎదురుచూడాల్సి వస్తుంది. నగర శివార్లలోనే ఎక్కువ మంది కొత్త గ్యాస్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు

కొత్త గ్యాస్‌ కనెక్షన్ల కోసం ఎల్‌పీజీ డీలర్ల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు కాకుండా చిరునామా మారిన వారు, ఎల్‌పీజీ కనెక్షన్లకు సంబంధించిన పత్రాల్లో మార్పులు, చేర్పుల కోసం కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త కనెక్షన్లు ఇచ్చేటప్పుడే పత్రాల్లో మార్పులు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ (సర్‌) నోటీసులు అందుకున్న వారు చిరునామా ధ్రువీకరణ కోసం, అలాగే ఆధార్‌లో మార్పుల కోసం ఎల్‌పీజీ కనెక్షన్‌ పత్రాలను ఆధారంగా చూపించేందుకు అవకాశం ఉంది. అయితే గ్యాస్‌ బుక్‌లో చిన్నపాటి మార్పులు గతంలో వెంటనే చేసేవారు. ఇప్పుడు వీటిని సవరించుకునే అవకాశం లేదంటున్నారు. కొత్త గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేటప్పుడే వీటిని కూడా సవరిస్తామంటున్నారు. దీంతో ఆధార్‌లో సవరణలు, సర్‌ కోసం ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.

బుకింగ్‌ గడువులో తీవ్ర ఇబ్బందులు

కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు నిరీక్షణ

డబుల్‌ సిలిండర్‌ దొరకక తిప్పలు

స్పష్టత ఇవ్వని గ్యాస్‌ ఏజెన్సీలు

జిల్లాలో 3.92 లక్షల కనెక్షన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement