● బీఆర్‌ఎస్ బాటలోనే కొనసాగుతోంది:ఎంపీ డీకే అరుణ
చిన్నచింతకుంట: తెలంగాణ విమోచన దినోత్సవా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరులపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రజాకార్ల నిరంకుశత్వానికి అప్పంపల్లి రావిచెట్టు సాక్ష్యంగా నిలిచిందన్నారు. అమరుల రక్తంతో తడిసిన ఈ నేల ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రతంగ్ పాండురెడ్డి, పడాకుల శ్రీనివాస్, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, నంబిరాజు, యజ్ఞభూపాల్‌రెడ్డి, కుర్వరమేష్, ప్రశాంత్‌రెడ్డి, బలరాం రెడ్డి, దశరథ్, లక్ష్మి, వీరబ్రహ్మచారి, రఘురామయ్య, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అప్పంపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ


