చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు.
ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయాలని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పీఆర్ శాఖ మంత్రి సీతక్కను కలిసి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ గౌరవ వేతనాలు, పంచాయతీ నిధులు విడుదల చేయాలని, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని, ఇందిరమ్మ కమిటీలతో సర్పంచ్‌ల అధికారాలను తగ్గించే జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర అన్నారు. హనుమకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే జూనియర్ అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషుల, మహిళా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శనివారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌చంద్ర జెండాఊపి ఎంపికలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కోచ్‌లు ఆనంద్‌కుమార్, సునీల్‌కుమార్, శ్రీనివాస్, పీడీలు సి.శ్రీనివాసులు, రమేష్‌బాబు, ఎ.శ్రీనివాస్, రాజు, వినోద్‌కుమార్, శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 4 పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: కరీంనగర్‌లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలు సాధించారు. 8–10 ఏళ్ల విభాగంలో రిత్విక్‌రెడ్డి, 10–12 ఏళ్ల విభాగంలో దౌసిక్ శ్రీప్రసాద్, 14–16 ఏళ్ల విభాగంలో ఎం.శివతేజ, 16–18 ఏళ్ల విభాగంలో సీహెచ్.అఖిల్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. అదే విధంగా 12–14 ఏళ్ల బాలుర విభాగంలో జయచంద్ర నాలుగోస్థానం, బాలికల విభాగంలో ఎం.రూప ఐదోస్థానం, 16–8 ఏళ్ల బాలుర విభాగంలో ఎన్.మధు ఆరో స్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్, టి.చంద్రశేఖర్, చైర్మన్ శాంతికుమార్, కార్యనిర్వాహక కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు అభినందించారు.


