పాలమూరు: కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ప్రశాంతమైన జీవనం సాగించే అవకాశం ఉంటుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. ఒకసారి కేసును రాజీ చేసుకుంటే జీవితకాలంలో తిరిగి అదే వివాదంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదన్నారు. జిల్లా ప్రధాన కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. కక్షిదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలకు పరిష్కారం చూపేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా దేవరకద్ర కోర్టులోనూ ప్రత్యేక బెంచీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్, డ్రంకన్ డ్రైవ్, చెక్‌బౌన్స్, ఇన్సూరెన్స్, రోడ్డు ప్రమాద తదితర కేసులను పరిష్కరించినట్లు వివరించారు.
మూడు కోర్టుల్లో 7,075 కేసులు రాజీ
మహబూబ్‌నగర్ కోర్టులో ఐదు, జడ్చర్లలో ఒకటి, దేవరకద్రలో ఒక బెంచీ చొప్పున మొత్తం ఏడు బెంచీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 7,075 కేసులను రాజీ పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఇన్సూరెన్స్ కేసులో బాధితులకు రూ.21.50 లక్షల చెక్కును న్యాయమూర్తి అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆంజనేయులు, ఆఫ్రోజ్ అక్తర్, ఇందిర, ఈశ్వరయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌శాఖ పరిధిలో 3, 200 కేసులు రాజీ
జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 3,200 కేసులు పరిష్కరించారు. రాజీ అయిన కేసుల్లో 432ఎఫ్‌ఐఆర్‌లు, 752 డ్రంకన్‌డ్రైవ్ కేసులు, ఈ–పెట్టీ కేసులు 1988, అదేవిధంగా 57సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పరిష్కరించారు. ప్రధానంగా మూడు కోర్టుల్లో కలిపి సైబర్ నేరాల్లో మొత్తం 57 కేసుల్లో కలిపి రూ.56.65లక్షల నగదు తిరిగి బాధితులకు ఇప్పించారు. ఈ కేసుల పరిష్కార ప్రక్రియలో కోర్టు డ్యూటీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది విశేషంగా కృషి చేశారని ఎస్పీ డి.జానకి అభినందించారు.
ఒక్కసారి రాజీ చేసుకుంటే జీవితకాలం సమస్య ఉండదు
మూడు కోర్టుల్లో 7,075 కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత


