జడ్చర్ల టౌన్: కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈ నెల 9న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలసాధన దీక్షా దినంగా జరుపుకుందామని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు జరుగుతున్న నీటి అన్యాయంపై మరోమారు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా డిండి పేరుతో జిల్లాకు అన్యాయం చేసేందుకు పాలకులు పాల్పడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులంటే ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నాయకులు భయపడుతున్నారని ఆరోపించారు. కృష్ణానదిలో 276 టీఎంసీల నీటిని మనం వినియోగించుకోవాల్సి ఉండగా 70 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 6 టీఎంసీలు నదిలో పారటానికి కేటాయించగా మిగిలిన 200 టీఎంసీలో 170 టీఎంసీలు నల్లగొండ జిల్లాకు వెళ్తున్నాయన్నారు. మిగిలిన 30 టీఎంసీల నీటిని మాత్రమే మనం వినియోగించాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, అన్నింటిని పూర్తి చేసేందుకు పోరాటాలు తప్పవన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎడారి కాకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తికావాల్సిన అవసరం ఉందని, 40 లక్షల ఎకరాల సాగుభూమికి నీళ్లు అందేవరకు పోరాటం చేయాల్సిందేనన్నారు. దీక్ష దినం రోజున అన్ని మండల కేంద్రాల్లో సాగునీటిపై జరుగుతున్న అన్యాయం గురించి చర్చించాలన్నారు. అదే విధంగా ఈ నెల 12న నాగర్‌కర్నూల్ గాంధీపార్కులో జలసాధన సత్యాగ్రహి దీక్ష నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రాఘవాచారి, సభ్యులు చెన్నకిష్టప్ప, యాదగిరి, శంకర్‌బాబు, మోహన్‌రాజ్, కుర్మంతి పాల్గొన్నారు.


