మహబూబ్‌నగర్ రూరల్/చిన్నచింతకుంట: మ న్యం ్డకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, కురుమూర్తి దేవస్థానాలు శనివారం జనసంద్రమయ్యాయి. శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు మన్యంకొండ, కురుమూర్తికి తరలివచ్చారు. శ్రావణమాసం వేడుకలను మన్యకొండలో ప్రతిఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే దేవస్థానంలో ఈ ఏడాది కూడా నెలరోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సర్వాభరణ అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలతోపాటు ప్రత్యేక పూజలు, శేషవాహన సేవలు నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానం ముందున్న కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులుదీరారు. దీంతో ఎక్కడ చూసినా మన్యంకొండలో భక్తులే కనిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చాలామంది భక్తులు దిగువ కొండ నుంచి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. దేవస్థానంతోపాటు స్టేజీ సమీపంలోని శ్రీఅలివేలు మంగతాయారు దేవస్థానంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భగుడిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. దీంతో ఆయా ఆలయాల్లో శ్రావణమాసం పూజలు ముగిశాయి. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజుతోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
శ్రావణమాసం చివరి శనివారం తరలివచ్చిన భక్తులు
జనసంద్రమైన మన్యంకొండ, కురూమూర్తి గిరులు
దాసంగాలతో స్వామివారికి నైవేద్యాలు


