వరుస ఘటనలతో కలవరం
ప్రధాన విభాగాల్లో శస్త్రచికిత్సలకు రోగుల నిరీక్షణ
● మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్లు.. రాత్రివేళ హౌజ్ సర్జన్లతోనే వైద్యం
● 340 వైద్య పోస్టుల్లో 212 ఖాళీలు.. ఆర్థోలో 15 పోస్టులు ఖాళీ
● జనరల్ ఆస్పత్రిలో కలవరపెడుతున్న వరుస ఘటనలు
వాతావరణం
ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమై ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు నమోదు కావచ్చు.
సర్జరీ కోసం.. నెలల తరబడి నిరీక్షణ!
అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన జేసీబీ డ్రైవర్ ఆంజనేయులుకు ఎడమ చేయి విరిగింది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేసి రాడ్ వేశారు. రెండేళ్ల తర్వాత రాడ్ తొలగించేందుకు వెళ్లగా రూ.50 వేల ఖర్చవుతుందని చెప్పడంతో గత ఏప్రిల్ నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఓపీ తీసుకుని వైద్యులను సంప్రదించినా.. 15 రోజులు, నెల రోజుల తర్వాత రావాలని తిప్పుతున్నారని వాపోయాడు. మరోసారి ఆస్పత్రికి వచ్చిన అతడి సమస్యను ‘సాక్షి’ వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా.. శనివారం అడ్మిట్ చేసుకుని రాడ్ తొలగిస్తామని ఆర్థో విభాగం వైద్యులు తెలిపారు.
జిల్లా జనరల్ ఆస్పత్రిలోని కొన్ని విభాగాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు రోగులు, వారి బంధువుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గైనిక్ విభాగంలో వైద్య సేవలపై గతంలో ఆరోపణలు రావడంతో పాటు.. ఇంజక్షన్ మార్పిడి ఘటనలో యువకుడు మృతి చెందిన ఉదంతం, తాజాగా నెల రోజుల శిశువు తొడలో సూది విరిగిన ఘటన చర్చనీయాంశంగా మారాయి. వార్డుల్లో సిబ్బంది ప్రవర్తనపైనా రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సేవల నాణ్యత, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాలమూరు: పేదలు, సామాన్యులకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా క్షీణిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓపీ సమయాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ.. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సల విషయంలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు రాత్రి వేళ ఆస్పత్రికి వస్తే సీనియర్ వైద్యుల అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో వచ్చిన వారిని హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్న పరిస్థితి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైద్య సిబ్బంది కొరత కూడా ఆస్పత్రి సేవలపై ప్రభావం చూపుతోంది.
340 వైద్య పోస్టులు.. 212 ఖాళీలు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లతో కలిపి మొత్తం 340 వైద్య పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 128 మంది మాత్రమే విధుల్లో ఉండగా.. 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేస్తున్న వారిలో 67 మంది రెగ్యులర్ వైద్యులు, 61 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఖాళీల్లో 153 రెగ్యులర్, 59 కాంట్రాక్టు పోస్టులు ఉన్నాయి. ఇక పరిపాలన, టెక్నికల్, నర్సింగ్, ఫార్మసిస్ట్ తదితర విభాగాల్లో 363 పోస్టులు మంజూరు కాగా 235 మంది పనిచేస్తున్నారు. 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్ కింద మంజూరైన 112 పోస్టుల్లో 95 మంది విధులు నిర్వహిస్తుండగా 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రోజుకు రెండు, మూడు సర్జరీలు చేసేలా చర్యలు..
ఆర్థో విభాగంలో గతంలో పరికరాల కొరత కారణంగా కొన్ని శస్త్రచికిత్సలు జరగలేదు. ప్రస్తుతం సీ–ఆర్మ్, ఆర్థో డ్రిల్ మిషన్లు అందుబాటులోకి వచ్చినందున అన్ని రకాల ఆర్థో శస్త్రచికిత్సలను పెంచుతాం. రోజుకు రెండు, మూడు సర్జరీలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విభాగాల్లో హెచ్‌ఓడీలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ పెంచి సేవలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
– డాక్టర్ రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్


