గుడిసెల జాబితా సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

గుడిసెల జాబితా సిద్ధం చేయండి

Aug 27 2026 1:00 AM | Updated on Aug 27 2026 1:00 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి గుడిసెల్లో నివసిస్తున్న వారి జాబితాను నిర్ణీత వ్యవధిలోగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌ నుంచి వెబ్‌ఎక్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు గుడిసెల జాబితా నివేదికలు సమర్పించని మండలాల అధికారుల తీరుపై అసంతప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న సమాచారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే జిల్లా కార్యాలయానికి నివేదించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని.. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.

సాగు, తాగునీటి

సమస్య పట్టదా?

రాజాపూర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దాలుగా నెలకొన్న సాగు, తాగునీటి సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించలేకపోతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొ.హరగోపాల్‌ అన్నారు. బుధవారం రాజాపూర్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరందుతున్న చోట మూడు పంటలతో ఆదాయం పొందుతుండగా.. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం వర్షంపై ఆధారపడుతూ, ఒక పంట కూడా పొందలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకే కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏ సీని అధ్యయన వేదిక ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా యువ రైతాంగం, ప్రజలు గ్రామగ్రామానా జలసాధన జేఏసీలను ఏర్పాటు చేయా లని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే సెప్టెంబర్‌ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా జలసాధన దీక్షాదినంగా పాటించాలని కోరారు. సమావేశంలో అధ్యయన వేదిక జనరల్‌ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, పీబీ స్వామి, రవీంద్రనాథ్‌, రాఘవాచారి ఉన్నారు.

శ్రీశైలంలో 874.70 అడుగుల నీటిమట్టం

అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో బుధవా రం 874.70 అడుగులు (162.0554 టీఎంసీలు)గా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన కొనసాగిస్తూ.. 14,359 క్యూసెక్యుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం 164.7532 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. విద్యుత్‌ ఉత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారుగా 2 టీఎంసీల నీటిమట్టం తగ్గింది. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 14.663 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

170.477 మి.యూ. విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో 170.477 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement